Alla Ramakrishna Reddy: వైసీపీలో చేరిన ఆర్కే.. నారా లోకేశ్‌ను ఓడిస్తామని వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆర్కే మాట్లాడుతూ మంగళగిరిలో వైసీపీని మూడోసారి గెలిపించడానికి మళ్లీ పార్టీలోకి వచ్చానని తెలిపారు. కొన్ని కారణాల వల్ల తాను రెండు నెలలు పక్కకి వెళ్లానని కానీ జగన్ బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 175కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 లోక్‌సభ సీట్లు సాధించే యజ్ఞంలో తానూ భాగమవుతానన్నారు. మంగళగిరిలో ఎవరు బరిలో ఉన్నా గెలుపునకు తాను పనిచేస్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో తన చేతుల్లో లోకేశ్ ఓడిపోయారని 2024లోనూ బీసీ చేతిలో లోకేశ్ ఓడిపోతారని జోస్యం చెప్పారు. మంగళగిరిలో తాను అడిగిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా సీఎం జగన్ చూశారని ఆర్కే వెల్లడించారు.
ఇటీవల మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో అలకబూనిన ఆర్కే వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైయస్ షర్మిల నియమితులు కావడంతో హస్తం పార్టీలో చేరారు. అయితే కాంగ్రెస్‌లో తనకు అంత ప్రాధాన్యత దక్కడం లేదని ఆర్కే కినుక వహించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆర్కేతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అయిపోయింది ఏదో అయిపోయింది.. పార్టీలోకి తిరిగి వస్తే సముచిత గౌరవం, అధికారంలోకి వస్తే మంత్రిపదవి ఇప్పించేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆయన సానుకూలంగా స్పందించారట. దీంతో జగన్‌తో భేటీకి మార్గం సుగమం అయింది. ఆయనకు మంగళగిరి గెలుపు బాధ్యతలు అప్పగించబోతున్నారని కూడా మరో వాదన ఉంది.
మంగళగిరిలో టీడీపీ యువనేత నారా లోకేష్‌ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించారని టాక్. కాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో లోకేష్‌పై విజయం సాధించి టీడీపీకి షాక్ ఇచ్చారు. అయితే మంత్రి పదవి ఇస్తానని జగన్ మాట తప్పడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుండా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గంజి చిరంజీవిని పార్టీ ఇంఛార్జిగా నియమించడంతో మనస్తాపం చెందిన ఆర్కే తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments