Alla Ramakrishna Reddy:వైయస్ షర్మిల వెంటే నడుస్తా.. ఆర్కే సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Saturday,December 30 2023]

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ సోదరి వైయస్ షర్మిల వెంట నడుస్తానని.. ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్తే తానూ కూడా వెళ్తానని స్పష్టం చేశారు. తిరిగి వైసీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనకు వేరే పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చానని.. కానీ వైయస్ వారసురాలు షర్మిలతోనే తన ప్రయాణమని తెలిపారు. మంగళగిరి అభివృద్ధికి రూ.1200 కోట్లు కేటాయిస్తామని చెప్పి కేవలం రూ. 120 కోట్లే కేటాయించారన్నారు. మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదని తానే రూ.8కోట్ల వరకు అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానని వాపోయారు.

లోకేశ్‌ని ఓడించిన తనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా అని మండిపడ్డారు. అభివృద్ధికి చేయకుండా ప్రజలను ఓట్లు ఎలా అడుగుతామని ప్రశ్నించారు. తాను వైసీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో సీఎం జగనే సమాధానం చెప్పాలన్నారు. పార్టీలో నుంచి పొమ్మనలేక పొగబెట్టారని పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదించకపోవడం వాళ్ల ఇష్టమని.. తాను మాత్రం స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా సమర్పించానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైఖరి వల్ల మంగళగిరి, కుప్పం, గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం లేదని వివరించారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై కోర్టుల్లో వేసిన కేసులపై వెనక్కి తగ్గనని.. న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. అలాగే సీఎం జగన్ తప్పు చేసినా క్రిమినల్ కేసులు వేస్తానని కూడా హెచ్చరించారు. వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆర్కే.. షర్మిల వెంటే నడుస్తానని చెప్పడం ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను నియమిస్తారని జోరుగా వార్తలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే తాను కూడా వస్తానని ఆర్కే చెప్పడం చూస్తుంటే త్వరలోనే షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా నియమితులు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే కనక జరిగితే వైసీపీలో అసంతృప్తిగా ఉన్న 40 నుంచి 50 మంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రంలో మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన వైసీపీని ఓడించాలనే పట్టుదలతో ఉమ్మడిగా ముందుకు సాగుతున్నాయి. తాజాగా షర్మిల కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలు అయితే వైసీపీ ఓటు బ్యాంకు భారీగా చీలిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. మొత్తానికి సీఎం జగన్ సోదరి ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెడితే మాత్రం వైసీపీకి రాజకీయంగా పెద్ద దెబ్బే అని చెబుతున్నారు.