INS Vikrant: నౌకాదళంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ : ఆ దేశాల సరసన ఇండియా, ప్రత్యేకతలివే
Send us your feedback to audioarticles@vaarta.com
భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరింది. మనదేశం దేశీయంగా నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. కొచ్చిన్ షిప్ యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని చేతుల మీదుగా ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ఇండియన్ నేవీలో ప్రవేశపెట్టారు. ఇన్నాళ్లు ఆయుధాలు ఇతర అవసరాల కోసం విదేశాల మీద ఆధారపడిన భారత్.. తాము కూడా సొంతంగా విమాన వాహక నౌకలు తయారు చేసుకోగలమని నిరూపించింది. తద్వారా ఈ సామర్ధ్యం వున్న 6వ దేశంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా సరసన భారత్ చేరింది. కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ తయారీ ఖర్చు దాదాపు రూ.20,000 కోట్లు.
ఒకేసారి 30 యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లను మోసకెళ్లగలిగే సత్తా:
ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. పాక్‌తో జరిగిన 1971 యుద్ధంలో సేవలందించిన తొలి విమాన వాహక నౌక.. ఐఎన్ఎస్ విక్రాంత్ పేరునే దీనికి పెట్టారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు వున్న ఈ నౌక బరువు 45 వేల టన్నులు. గంటలకు 28 నాటికల్ మైళ్లు ( 51.8 కి.మీ) స్పీడుతో సముద్రంలో విక్రాంత్ దూసుకెళ్తుంది. దీని ద్వారా 30 యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లను తీసుకెళ్లవచ్చు.
100 కుటీర పరిశ్రమలకు ఉపాధి కల్పించిన విక్రాంత్ :
విక్రాంత్ తయారీకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)తో పాటు బీహెచ్ఈఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ అండ్ టీ వంటి ప్రైవేట్ సంస్థలు సహా 100 చిన్న తరహా సంస్థలు పాలు పంచుకున్నాయి. సెయిల్ ఉద్యోగులు రెండు వేల మంది, 13 వేల మంది బయటి వ్యక్తులు సేవలందించారు. దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విక్రాంత్‌కు అవసరమైన పరికరాలను తయారు చేశారు.
గంటలో 1000 మందికి చపాతీలు చేసే కిచెన్:
ఐఎన్ఎస్ విక్రాంత్‌లో 1700 మంది నేవీ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. అలాగే 16 పడకలతో చిన్న ఆసుపత్రి, రెండు ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్‌లు, వార్డులు, ఐసీయూలు, సిటీ స్కాన్ మెషీన్ వంటి అత్యాధునిక వైద్య సదుపాయాలను కల్పించారు. విక్రాంత్ లోపల 2,300 కంపార్ట్‌మెంట్లను నిర్మించారు. లోపల వున్న అంతస్తుల్లోకి వెళ్లేందుకు నిచ్చెనలను, మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక క్యాబిన్లను ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడ ఏర్పాటు చేసిన కిచెన్‌లో గంటలో 1000 మందికి చపాతీలు, ఇడ్లీలు తయారు చేయవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments