Abortion rights : పెళ్లికాని స్త్రీలు అబార్షన్ చేయించుకోవచ్చు... సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు
Send us your feedback to audioarticles@vaarta.com
సాధారణంగా మనదేశంలో పెళ్లి అయిన వారు ఒకవేళ అవాంచిత గర్భాన్ని ధరించినట్లయితే.. భర్త, ఇతర కుటుంబ సభ్యుల అనుమతితో వైద్యులు అబార్షన్ చేస్తారు. అయితే పెళ్లికాకుండానే గర్భం దాల్చిన వారి బాధలు అన్నీఇన్నీ కావు. సమాజం తమను ఎలా చూస్తుందోనన్న భయంతో అబార్షన్‌కు జంకుతారు. అటు వైద్యులు కూడా నానా రకాల ప్రశ్నలతో అబార్షన్‌కు నిరాకరిస్తారు. ఈ క్రమంలో నెలలు నిండిన తర్వాత పుట్టిన పసిగుడ్డును చెత్త కుండీలోనో, రోడ్ల పక్కనో పడేస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి సుప్రీంకోర్ట్ శుభవార్త చెప్పింది. వైవాహిక స్థితితో సంబంధం లేకుండా స్త్రీలు సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్ చేయించుకునే హక్కు వుందని వెల్లడించింది.
గర్భాన్ని కొనసాగించమని అవివాహితురాలిని బలవంతం చేయడానికి వీల్లేదు:
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం ప్రకారం 24 వారాల లోపు గర్భాన్ని తొలగించుకునేందుకు అవివాహిత మహిళలకు అవకాశం వుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జేబీ పర్దివాలా, ఏఎస్ బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అవివాహితకు ఇష్టం లేకున్నా.. ప్రెగ్నెన్సీని కొనసాగించాలని చెప్పే అధికారం ఎవరికీ లేదని ఇది ఎంటీపీ చట్టానికి విరుద్ధమని అత్యున్నత ధర్మాసనం తేల్చిచెప్పింది. 2021లో సవరణ తర్వాత ఎంటీపీ చట్టంలోని సెక్షన్ 3లో భర్తకు బదులుగా భాగస్వామి అనే పదాన్ని ఉపయోగించారని జస్టిస్ డీవై చంద్రచూడ్ గుర్తుచేశారు. పెళ్లి కాని మహిళలకు కూడా ఇది వర్తిస్తుందన్న ఉద్దేశాన్ని ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. సామాజిక వాస్తవాలకు అనుగుణంగా చట్టాలు మారుతూ వుంటాయని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఇది కేసు నేపథ్యం:
తన 23 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాల్సిందిగా ఈ ఏడాది జూలై 16న మణిపూర్‌కు చెందిన ఓ మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఇంకా వివాహం జరగకపోవడం, తన భాగస్వామి పెళ్లికి నిరాకరించడం వల్ల బిడ్డకు జన్మనివ్వలేనని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. దీనిని సవాల్ చేస్తూ సదరు మహిళ సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.
ప్రస్తుతం భారతదేశంలో పెళ్లి కాని మహిళలు, సింగిల్‌గా వున్న మహిళలకు అబార్షన్ గడువు 20 వారాలుగా వుంది. పెళ్లయిన మహిళలకు మాత్రం ఇది 24 వారాలుగా వుంది. అయితే పెళ్లయిన, పెళ్లికాని మహిళల విషయంలో వైరుధ్యం చూపడం వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని ఆగస్ట్ 7 నాటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్ట్ అభిప్రాయపడింది. ఏకపక్షంగా వున్న ఈ క్లాజును రద్దు చేస్తామని సుప్రీం అప్పుడే చెప్పింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com