YS Jagan: చంద్రబాబు హయాంలో అన్ని స్కాములే.. సీఎం జగన్ విమర్శలు..
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రైతుభరోసా నిధులను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ ప్రసంగిస్తూ.. చంద్రబాబు ఏది ముట్టుకున్నా స్కాములే ఉన్నాయని ఎద్దేవా చేశారు. స్కిల్ స్కాం, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, ఇసుక, ఇలా అన్నింటిలోనూ దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలో పేదలు, వృద్ధులు, రైతులు, విద్యార్థుల గురించి ఆలోచించలేదని విమర్శించారు. చంద్రబాబు వెంట గజదొంగల ముఠా, దత్తపుత్రుడు ఉన్నారని.. తన కోసం, తన గజదొంగల ముఠా కోసమే చంద్రబాబు అధికారం కోరుకుంటున్నారని జగన్ వివరించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదని, వారికి పెట్టుబడి సాయం అందించాలన్న ఆలోచనే చేయలేదని మండిపడ్డారు.
తనకు చంద్రబాబు లాగా దొంగల ముఠా, దత్తపుత్రుడు లేరని.. ప్రజలే తన సైనికులని తెలిపారు. ఈ నాలుగన్నరేళ్లలో మీకు మంచి జరిగిందో లేదో ఆలోచించాలని.. మంచి జరిగిందని భావిస్తే తనకు అండగా నిలబడాలని కోరారు. తన హయాంలో అన్నదాతలకు అండగా నిలబడేందుకు రూ.1.73 లక్షల కోట్లు ఖర్చు చేశామని.. రూ.2.42 లక్షల కోట్లు అక్క చెల్లెమ్మలకు అందించామని పేర్కొన్నారు. ఇంటి వద్దకే సంక్షేమం అందించేలా వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చామని చెప్పారు. గుమ్మం ముందే వైద్య సేవలందేలా ఫ్యామిలీ డాక్టర్, జగనన్న సురక్ష, విలేజ్ క్లినిక్ వంటి కార్యక్రమాలు తెచ్చామని ఆయన వివరించారు.
టీడీపీ ప్రభుత్వంలో వ్యవసాయానికి 7 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోయారన్నారు. మనసున్న ప్రభుత్వానికి మనసులేని ప్రభుత్వానికి తేడా గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ-క్రాప్ ద్వారా ప్రతి రైతుకు మంచి జరిగేలా చేస్తున్నామని.. ప్రతి గ్రామాల్లో ఆర్‌బీకే కేంద్రాలు తీసుకొచ్చామన్నారు. రైతులకు లబ్ధి చేరేందుకు ఏటా రూ.13,500 రైతు భరోసా సాయం అందిస్తున్నామని తెలియజేశారు. చంద్రబాబు హయాంలో వరుసగా ఐదేళ్లు కరువేనని.. దేవుడి దయతో గత నాలుగేళ్లుగా కరువు మాటేలేదన్నారు. ఎన్నికల వేళ దొంగల ముఠా మోసపూరిత హామీలతో వస్తారు.. కిలో బంగారం, బెంజ్ కార్లు ఇస్తామని చెబుతారు.. వారి మాయమాటలు నమ్మకండని జగన్ కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments