Tirumala:శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన తిరుమల.. రేపే అంకురార్పణ, 18న పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 18వ తేదీ సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. 18న రాత్రి సీఎం వైఎస్ జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరగనున్నాయి. 22 వ తేదీ రాత్రి శ్రీవారి గరుడ వాహన సేవ జరగనుంది. 23వ తేదీ సా 4 గంటలకు స్వర్ణరథంపై శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 24వ తేదీ ఉ 8 గంటలకు సూర్యప్రభ వాహనం, 25వ తేదీ ఉ 6:55 గంటలకు రథోత్సవం జరగనుంది. సెప్టెంబర్ 26వ తేదీన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన చక్రస్నానం ఆ రోజున ఉదయం 6 గంటలకు జరగనుంది. అదే రోజు రాత్రి 9 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
సర్వాంగ సుందరంగా ముస్తాబైన తిరుమల:
మరోవైపు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. జీఎన్‌సీ టోల్‌టేట్ నుంచి శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు, పార్కులు, ఆస్థాన మండపాలు, అన్నదాన సత్రాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు, మాడవీధులను రంగు రంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 22న గరుడసేవకు భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకుని భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గరుడ సేవ రోజున దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచివుంటారని ఈవో వెల్లడించారు. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్ధరాత్రి రెండు గంటలైనా నెమ్మదిగా తీసుకెళ్తామని ధర్మారెడ్డి చెప్పారు.
బ్రేక్ దర్శనాలు రద్దు :
ఇకపోతే.. తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని పేర్కొంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలైజ్డ్ దర్శనాలనూ రద్దు చేసింది. సెప్టెంబర్ 22న గరుడ సేవ కారణంగా ఘాట్ రోడ్‌లో ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments