Alia Bhatt Ranbir Kapoor: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అలియా... కపూర్ ఇంట సంబరాలు

బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంట తల్లిదండ్రులయ్యారు. ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం అలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు . ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగానే వున్నారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు , అభిమానులు సోషల్ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఏప్రిల్ 14న వివాహ బంధంతో ఒక్కటూన అలియా - రణబీర్ కపూర్:

కాగా.. ఐదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ అలియా భట్ - రణబీర్ కపూర్‌లు ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అతికొద్దిమంది అతిథుల సమక్షంలో ముంబై బాంద్రాలోని వాస్తు అపార్ట్‌మెంట్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లయిన రెండు నెలలకే అలియా గర్భం దాల్చారు. గర్భవతిగా వున్నప్పటికీ భర్తతో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్‌లో ఉత్సాహంగా పాల్గొని .. సినిమా పట్ల తనకున్న కమిట్‌మెంట్‌ను తెలియజేశారు.

గర్భవతిగా వుండి బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్:

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ వారసురాలిగా వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన అలియా భట్.. తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, డియర్ జిందగీ, హైవే, రాజీ, గంగూబాయి కతియావాడి, ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర వంటి సినిమాలు అలియాకు దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తల్లిదండ్రులు కావడంతో అలియా, రణబీర్‌లు కొంతకాలం షూటింగ్స్‌కి బ్రేక్ చెప్పే అవకాశం వుంది.