మద్యం ప్రియులారా బీ అలర్ట్.. లేకుంటే అంతే సంగతులు!
- IndiaGlitz, [Monday,April 15 2019]
అసలే ఎండా కాలం.. చల్లగా ఏదో ఒకటి పడకపోతే కష్టం. అందుకే చాలా వరకు జనాలు కూల్ కూల్‌గా ఏదో ఒకటి తాగుదామని జ్యూస్ సెంటర్స్‌కు.. వైన్స్‌కు పరుగులు తీస్తుంటారు. మద్యపాన ప్రియులు మాత్రం ఎక్కడెక్కడ మద్యం దొరుకుతుందా అని వేచి చూస్తుంటారు. అయితే బీర్లో ఒక్కసారిగా ఏ పురుగో పుట్రో కనిపిస్తే పరిస్థితేంటి..? ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే ఎలా ఉంటుంది..? అవును ఇలాంటి పరిస్థితే వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఓ వ్యక్తికి ఎదురైంది.
వివరాల్లోకెళితే... రాకేశ్ అనే వ్యక్తి ఇటీవల పరకాల ఆర్టీసీ డిపో దగ్గరున్న మద్యం షాపులో బీరు కొనుగోలు చేశాడు. షాపు దగ్గరే కాకుండా బయటికెళ్లి తాగుదామని కొనుగోలు చేశాడు. బాటిల్ మూత తెరిచి చూడగా కంగుతిన్నాడు. బాటిల్ అడుగు భాగాన తేలు ఉండటంతో ఒక్కసారిగా ఆ బాటిల్‌ను విసిరిగొట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ వ్యక్తి నేరుగా షాపు దగ్గరికెళ్లి ఏంటిది..? మనుషులను చంపేస్తారా..? చూసుకోరా..? అని వైన్స్ యాజమాన్యంపై రాకేశ్ కన్నెర్రజేశాడు.
ఇందుకు స్పందించిన వైన్స్ యాజమాన్యం మొదట తమదగ్గర కొనలేదని వాదించారు. అయితే ఒకటికి రెండు సార్లు గట్టిగా వాదించగా మా షాపు కొన్నంత మాత్రాన మేం బాధ్యులం కాదని.. ఈ విషయంలో తాము చేసేదేమీ లేదని సమాధానమిచ్చారు. కాగా ఈ షాపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే షాపు కావడంతో బాధిత వ్యక్తితో పాటు పలువురు ధర్నాకు దిగేందుకు యత్నించగా షాపులో పనిచేసే కొందరు వారిపై దౌర్జన్యానికి దిగడం గమనార్హం. కాగా ఇలాంటి విషయాల్లో మద్యం ప్రియులు దొరికింది కదా అని తాగేశారో.. కిక్కు కాదు.. కక్కొచ్చి ఆస్పత్రి పాలవ్వడం పక్కా. అందుకే చల్ల చల్లాగా ఉంది కదా అని తాగేయకుండా.. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే మంచిది.