Download App

Aladdin Review

అల్లాద్దీన్ అద్భుత‌దీపం అంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రికీ ఆస‌క్తికరంగా ఉంటుంది. దీపంలో ఉండే దెయ్యం, అల్లాద్దీన్ దాన్ని కోరే మూడు కోర్కెలు, అనాథ‌గా ఉన్న రాకుమారుడు రాకుమార్తెను ద‌క్కించుకోవ‌డం వంటివ‌న్నీ స్పెష‌లే. ఎప్పుడూ థ్రిల్లింగ్‌గా ఉంటాయి. అలాంటి థ్రిల్లింగ్ అంశాల‌న్నిటినీ క‌లిపి త్రీడీలో అమ‌ర్చి `అలాద్దీన్‌`గా తెర‌కెక్కించారు. ఈ వేస‌వికి విడుద‌లైన ఈ సినిమా చిన్నా పెద్ద‌ల‌ను అల‌రిస్తుందా?  చ‌దివేయండి..

క‌థ‌:

ఓ నావ‌లో ఓ కుటుంబం ప‌య‌నిస్తూ ఉంటుంది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు వాళ్ల తండ్రి అల్లాద్దీన్ గురించి, అగ్ర‌బ రాజ్యానికి చెందిన యువ‌రాణి జాస్మిన్‌, అదే రాజ్యానికి చెందిన వ‌జీర్ జాఫ‌ర్ గురించి చెబుతాడు. ఆ క్ర‌మంలో సినిమా మొద‌ల‌వుతుంది. అల్లాద్దీన్ అనాథ‌. క్షుద్బాధ‌ను తీర్చుకోవ‌డానికి అత‌ను చిన్న దొంగ‌త‌నాలు చేస్తుంటాడు. అత‌నితో పాటు ఓ కోతి పిల్ల ఉంటుంది. దాని పేరు అబు. ఒక‌సారి సంత‌లో ఒక చిన్న పాప ఆక‌లి అని అడిగితే ఒక‌మ్మాయి అక్క‌డున్న రొట్టెల‌ను తీసి వాళ్ల‌కు ఇచ్చేస్తుంది. దానికోసం ఆమె చేతికున్న క‌డియాన్ని తీసుకోవాల‌ని చూస్తాడు వ్యాపారి. అల్లాద్దీన్ ఆమెను వాళ్ల నుంచి త‌ప్పిస్తాడు. మ‌చ్చ‌లేని మ‌గాడు, సాహ‌స‌వంతుడు అయితే గుహ‌లోకి వెళ్లి అక్క‌డున్న అద్భుత దీపాన్ని తీసుకొస్తాడ‌ని వ‌జీర్‌కు తెలుసు. ఆ క్ర‌మంలోనే అత‌ని కంట అల్లాద్దీన్ ప‌డ‌తాడు. అల్లాద్దీన్ చేత దీపం తెచ్చే డీల్‌కు ఒప్పిస్తాడు వ‌జీర్‌. అల్లాద్దీన్ గుహ‌లోకి వెళ్లి కేవ‌లం దీపాన్నే కాదు, ఓ మాయా తివాచీని కూడా తెస్తాడు. దాని సాయంతో అత‌ను యువ‌రాజు అవుతాడు. యువ‌రాణిని వివాహం చేసుకునే క్ర‌మంలో వ‌జీర్ ఏం చేశాడు? అల్లాద్దీన్ దీపం గురించి వ‌జీర్‌కు తెలిసిందా? వ‌జీర్ చేతికి దీపం ఎలా చేరింది వంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు.

ప్ల‌స్ పాయింట్లు:

ఈ సినిమాలో ప్ర‌ధాన‌మైన విష‌యం గ్రాఫిక్స్. అద్భుత‌మైన మాయ చేశారు గ్రాఫిక్స్ తో. అల్లాద్దీన్ ఓపెనింగ్ సీన్ నుంచి చూపించే స‌న్నివేశాలు చాలా అందంగా అనిపిస్తాయి. చూసే వారిని అబ్బుర‌ప‌రుస్తాయి. కోతి, పులిని చూసిన‌ప్పుడు ఎక్క‌డా గ్రాఫిక్స్ అనిపించ‌దు. స‌హ‌జంగానే ఉంటుంది. మాయా గుహ సెట్టింగ్ కూడా మెప్పిస్తుంది. న‌టీన‌టులు బాగా న‌టించారు. మ‌రీ ముఖ్యంగా జీనీ పాత్ర‌కు వెంక‌టేష్ వాయిస్ ప్ల‌స్ అయింది. వ‌రుణ్‌తేజ్ వాయిస్ వ‌ల్ల హీరో పాత్ర‌కు స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డింది. డైలాగులు కూడా స‌హ‌జంగా ఉన్నాయి. అనువాద చిత్రానికి ఉన్న‌ట్టు అక్క‌డ‌క్క‌డా అనిపించినా, చాలా చోట్ల క‌వ‌ర్ చేశారు.

మైన‌స్ పాయింట్లు:

క‌థ ఎంత‌కీ ముందుకు క‌ద‌ల‌కుండా ఉన్న చోట‌నే ఉన్న‌ట్టు అనిపిస్తుంది. చాలా చోట్ల ఇంకాస్త క్రిస్పీ స్క్రీన్‌ప్లే ఉంటే బావుండేదేమోన‌ని అనిపిస్తుంది. పాట‌లు ఉన్న చోట హాలీవుడ్ బాణీల‌కు తెలుగు ప‌దాల‌ను వింటుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ప‌దే ప‌దే పాట‌లు రావ‌డం చిరాకుగా ఉంటుంది. క్లైమాక్స్ కు ముందు స‌న్నివేశాలు మ‌రీ పేలవంగా అనిపిస్తాయి.

స‌మీక్ష‌:

అడుగ‌డుగునా వెంక‌టేష్ స‌ర‌దాగా చెప్పే మాట‌లు, వ‌రుణ్ తేజ్ వాయిస్‌, అబ్బు చేసే కోతి ప‌నులు, అల్లాద్దీన్‌లో అమాయ‌క‌త్వం, అందంగా క‌నిపించే యువ‌రాణి సినిమాకు ప్రాణాలు. అన‌వ‌స‌ర‌మైన స్లో పేస్‌, పంటికింద రాళ్లుగా ఉన్న పాట‌లు సినిమాలో మైన‌స్‌. క‌థ ప‌రంగా అందరికీ తెలిసిన విష‌య‌మే అయినా త్రీడీ ఎఫెక్ట్ బావుంది. మాయా గుహ‌లు, అర‌బ్ రాజ్యాల‌ను త్రీడీలో చూడ‌టం కొత్త అనుభూతి. కచ్చితంగా పిల్ల‌ల‌ను ఆక‌ట్టుకునే సినిమా అవుతుంది. ద‌ర్శ‌కుడు ఈ స‌బ్జెక్టును బాగా డీల్ చేశారు. మ‌రీ ముఖ్యంగా హ్యూమ‌న్ ఎమోష‌న్స్ ను బాగా క్యారీ చేశారు. జీనీ పాత్ర సినిమాకు హైలైట్‌. జీనీ మ‌నిషిగా మార‌డం, త‌న ప్ర‌భువును ఎలాగైనా ర‌క్షించుకోవాల‌ని జీనీ ప‌డే తాప‌త్ర‌యం, జీనీ ప‌ట్ల అల్లాద్దీన్ చేసే త్యాగం ఇవ‌న్నీ బాగా అనిపిస్తాయి. మ‌న‌సుకు క‌నెక్ట్ అవుతాయి. ఎమోష‌న్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చి, రిచ్‌గా వీఎఫ్ ఎక్స్ చేసి విడుద‌ల చేసిన ఈ సినిమా త‌ప్ప‌కుండా క‌న్నుల‌విందవుతుంది.

బాట‌మ్ లైన్‌: అల్లాద్దీన్ అల‌రిస్తాడు

Rating : 2.8 / 5.0