'అల వైకుంఠపురములో' మ్యూజికల్ ఫెస్టివల్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ పతాకాలపై స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తోన్న చిత్రం `అల వైకుంఠపురములో`. పూజ హెగ్డే నాయిక. చిత్రం ఈనెల 12 న విడుదల అవుతోంది ఎస్.ఎస్.తమన్ అద్భుతమైన సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజికల్ కాన్‌సర్ట్ సోమవారం హైదరాబాద్ యూసఫ్ గూడ్ పోలీస్ గ్రౌండ్స్‌లో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ(చినబాబు) విడుదల చేశారు. ఈ సందర్భంగా ...
ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ - ``ఇక్కడ ప్రేక్షకుల ఉత్సాహం చూస్తుంటే ఒక సంక్రాంతి సరిపోదేమో అనిపిస్తుంది. ఈ సంక్రాంతికి వస్తోన్న అల వైకుంఠపురములో దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో మాతో నార్మల్ ఫైట్సే కాదు.. పాటలో కూడా ఫైట్ చేయించిన దర్శకుడు త్రివిక్రమ్‌గారు. ఈ వేడుక చూస్తుంటే ఆల్ రెడీ సినిమా హిట్టయిన ఫీలింగ్ కలుగుతుంది. తమన్ సంగీతం అందించిన సామజవరగమన సహా అన్నీ సాంగ్స్ హిట్. పి.ఎస్.వినోద్‌గారు అద్భుతమైన విజువల్స్ చూపించారు. ఈ గొప్ప సినిమాలో మాకు అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. అల్లు అర్జున్‌గారికి డ్యాన్సులే కాదు .. అదే స్టైల్లో గొప్పగా ఫైట్స్ కూడా కంపోజ్ చేశాం. రేపు థియేటర్స్ లో సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు`` అన్నారు.
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులతో వైకుంఠపురంలాంటి సెట్‌లో ఈ వేడుకను త్రివిక్రమ్‌గారు చేయడం ఆనందంగా ఉంది. బ్లాక్‌బస్టర్ కొట్టేశారు. ఇప్పటికే తమన్ పాటలతో ఇరగొట్టేశాడు. బన్నీ డ్యాన్సులతో ఇరగొట్టేశాడు. త్రివిక్రమ్ గారు పంచ్ డైలాగ్స్‌తో ఇరగ్గొట్టేసారు.. ఇక సినిమా బావుందంటే చాలు.. మెగా ఫ్యాన్స్ సినిమా చూసి సక్సెస్‌తో ఇరగ్గొట్టేస్తారు. బన్నీ, త్రివిక్రమ్‌గారి కాంబినేషన్‌లో వస్తోన్న ఈసినిమా పెద్ద సక్సెస్ కావాలి. ఈ మధ్య ఇలాంటి మ్యూజికల్ హిట్ ఆల్బమ్ చూడలేదు. ఒక్కొక్క సాంగ్ 100 మిలియన్స్ క్రాస్ అయిపోతున్నాయి. తమన్ రాకింగ్ మ్యూజిక్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
నిర్మాత డా.కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ``తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే సినిమా పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చాయి. సినిమా డెఫినెట్ గా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ బన్నీ, అరవింద్, రాధాకృష్ణ, తమన్ సహా అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ - నేను కూడా బన్నీకి చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఒక ఫ్యాన్‌గా ఉంటేనే ఇలా కంపోజ్ చేయగలం. త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్. ఆయన వల్లే నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. అలాగే నిర్మాతలు, రెండు పెద్ద బ్యానర్స్ హారిక అండ్ హాసిని, గీతాఆర్ట్స్ ఎంతో కష్టపడ్డారు. అందరికీ థ్యాంక్స్`` అన్నారు.
సింగర్ అర్మాన్ మాలిక్ మాట్లాడుతూ - ``నా పేరు సూర్య తర్వాత బన్నీగారి సినిమాలో నేను పాడుతున్నాను. బుట్ట బొమ్మలాంటి మంచి సాంగ్‌ను నాకు ఇచ్చినందుకు తమన్‌గారికి థ్యాంక్స్`` అన్నారు.
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ - ``కొంత మందితో పనిచేస్తుంటే కష్టం, సమయం తెలియదు. బుట్ట బొమ్మ సాంగ్‌ను రాశాను. త్రివిక్రమ్‌గారితో పనిచేయడమంటే పండగలా ఉంటుంది. చాలా సరదాగా ఉంటారు. ఈ పాటకు వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తమన్ ఈ సినిమాకు ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. తనకు స్పెషల్ థ్యాంక్స్. బన్నీ, విశాలమైన హృదయమున్న వ్యక్తి. ఆయనతో చాలా సినిమాలకు పనిచేశాను. ఈ సినిమాకు పనిచేయడం గొప్పగా అనిపించింది`` అన్నారు.
హీరో సుశాంత్ మాట్లాడుతూ - ``ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేసిన బన్నీగారికి, త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్. కథ వినకుండానే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. బన్నీతో కలిసి త్రివిక్రమ్‌గారి దర్శకత్వంలో చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. బన్నీ, త్రివిక్రమ్‌గారు, చినబాబుగారు, అల్లు అరవింద్‌గారికి థ్యాంక్స్. నన్ను నాకే కొత్తగా త్రివిక్రమ్‌గారు చూపించారు. నేను ఇలా కూడా చేయవచ్చా అనిపించింది. ఈ సినిమా చేయడం చాలా హెల్ప్ అయ్యింది. ఇలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతానని నేను అనుకోలేదు. బన్నీ నాకు ఫ్రెండ్‌గా బాగా తెలుసు. అయినా నా కంఫర్ట్ నాకు ఇచ్చాడు. టబు గారిని నిన్నే పెళ్ళాడతా సమయంలో ఆమెను సెట్స్‌లో కలుసుకున్నాను. తర్వాత యాక్టింగ్ స్కూల్‌కోసం ముంబై వెళితే.. టబుగారు ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకున్నారు. ఆవిడతో కలిసి ఈ సినిమాకు పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. పూజ, నివేదా, నవదీప్, సముద్రఖని ఇలా ఎంటైర్ టీమ్ గొప్పగా కుదిరింది. గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. తమన్‌కి, పి.ఎస్.వినోద్‌గారికి థ్యాంక్స్`` అన్నారు.
ప్రముఖ గాయనీమణులు ప్రియా సిస్టర్స్ మాట్లాడుతూ - ``12 ఏళ్ల క్రితం ఓ తెలుగు మూవీలో పాడాం. ఇన్నేళ్లకు ఈ సినిమాలో పాడాం. ఐదారు లైన్ పాటే అయినా కానీ.. ట్యూన్ పరంగా చాలా క్లిష్టమైన ట్యూన్. బమ్మెరపోతనగారి పద్యాన్ని పాడే అవకాశాన్ని కల్పించినందుకు త్రివిక్రమ్‌గారికి, అరవింద్‌గారికి, అల్లు అర్జున్‌గారికి థ్యాంక్స్`` అన్నారు.
ప్రముఖ హాస్యనటుడు,హీరో సునీల్ మాట్లాడుతూ - ``సినిమా టికెట్ కొని థియేటర్‌లోకి వచ్చిన ప్రేక్షకుడిని బన్నీ, పూజా, టబు, సుశాంత్, నివేదా, సముద్రఖని, సునీల్ ఇలా అందరం మీ ఇంటికి వచ్చినట్లు సినిమా ఉంటుంది. పండగకి మేమే మీ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. త్రివిక్రమ్ గురించి ఎంత తక్కువ మాట్లాడినా ఎక్కువే. బన్నీ గురించి చెప్పాలంటే.. ఎలాంటి యాట్యిట్యూడ్ లేని హీరో. తప్పకుండా ఆయన నటించిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
నాయిక నివేదా పేతురాజ్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో బన్నీతో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు, తమిళంలో నేను పనిచేసిన పెద్ద సినిమా ఇదే. త్రివిక్రమ్‌గారు సినిమాను డిఫరెంట్‌గా తెరకెక్కించారు.బన్నీ, త్రివిక్రమ్, అరవింద్, సుశాంత్, చినబాబు గార్లతో సహా అందరికీ పెద్ద థ్యాంక్స్. సినిమా కోసం ఎగ్జయిటెడ్‌గా వెయిట్ చేస్తున్నాను`` అన్నారు.
సీనియర్ నటి టబు మాట్లాడుతూ - ``ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే మాటలు రావడం లేదు. చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో యాక్ట్ చేశాను. త్రివిక్రమ్‌గారు, బన్నీగారు, అరవింద్‌గారు, సుశాంత్ అందరూ కుటుంబ సభ్యుల్లాగా మారిపోయారు. ఇంత గ్యాప్ తర్వాత తెలుగులో ఈ సినిమా కంటే గొప్పగా రీ ఎంట్రీ ఇవ్వలేనేమో అనిపించింది. తప్పకుండా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. అందరికీ చాలా థ్యాంక్స్`` అన్నారు.
సుప్రసిద్ధ గీత రచయిత పద్మశ్రీ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ - ``ఈ వేడుక చూస్తుంటే డబుల్ బొనాంజా, సూపర్‌డూపర్‌హిట్ సినిమాలా అనిపిస్తుంది. త్రివిక్రమ్ సినిమాకు అందమైన పేరు పెట్టాడు. అంతే అందంగా సినిమా ఉంటుంది. ఈ వైభవాన్ని అంతా బన్నీయే తన భుజాలపై మోస్తున్నాడు. ఆయనతో పాటు ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈ కథను సంక్రాంతి పండగలా అందంగా తీర్చిదిద్దిన త్రివిక్రమ్‌గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ పాటలకు ప్రేక్షకులు మనసుతో విన్నారు. సంగీతానికి భాష లేదు అనేలా అద్భుతమైన సంగీతాన్ని అందించిన తమన్‌కు అభినందనలు. కుర్రదనంతో సామజవరగమన పాట రాశానని పాట విన్నవారందరూ అన్నారు. అయితే నేను కుర్రాడిలా మారిపోలేదు.. అల్లు అర్జున్‌లా మారిపోయాను. త్రివిక్రమ్ ఇచ్చిన సామజవరగమన అనే పదాన్ని ఉపయోగించుకుని పాటను రాశాను. ఈ సరస్వతి వైభవాన్ని చూడటానికి కలికి శ్రీమహాలక్ష్మి థియేటర్స్‌కు వస్తుంది`` అన్నారు.
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ - ``ఈ సినిమాను కష్టపడి తీసింది నా స్నేహితుడు రాధాకృష్ణగారే. ఆయనకు అభినందనలు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చిన్న కథను బ్రహ్మాండంగా తీసి, రిలీజ్‌కుముందే హిట్ అనే రూపాన్ని ఇచ్చాడు. తమన్ 2019 వీడ్కోలు చెప్పడానికి ప్రతిరోజూ పండగే సినిమా, ఈ 2020 వెల్‌కమ్ చెప్పడానికి అల వైకుంఠపురములో సినిమా ఇచ్చాడు. తనకు థ్యాంక్స్`` అన్నారు.
చిత్ర దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ - ``ఓ రూమ్‌లో మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో పెద్దగా ట్రాఫిక్ లేని సమయంలో 30 ఏళ్ల యువకుడు, 60 ఏళ్ల పెద్దాయన కూని రాగం తీసుకుంటూ రాసిన పాట కొన్ని కోట్ల మంది హృదయాలను తాకింది. అదే సామజవరగమన. తన వయసు నుంచి దిగి ఆయన, తన వయసును ఎక్కి తమన్ కలిసి ఓ కామన్ పాయింట్‌ను కలిపి ఈ చిత్రానికి స్థాయిని తీసుకొచ్చారు. మా గుండెలు పట్టనంత ఆనందాన్ని మీకు వినిపించేయాలి.. మా కళ్లల్లో వచ్చిన నీటి చుక్క మీ అందరి కళ్లల్లోకి ఎలా రావాలి. ఓ సాయంత్రం కారులో వెళ్లే అబ్బాయి తన ప్రేయసి గుర్తు తెచ్చుకుంటూ.. అలాగే సాయంత్రం తనను చూస్తున్న యువకుడిని చూడనట్లు నటిస్తూ తన హెడ్ ఫోన్స్‌లో వినడానికి ఒక అత్యద్భుతమైన కళ్లని, ఒక జ్ఞాపకాన్ని ఇద్దరూ మనకు ఇచ్చారు. దానికి తన గొంతునిచ్చి సిద్ శ్రీరామ్ ఈ పాటను మన అందరి గుండెల్లోకి తీసుకొచ్చేశాడు. ఓ పాట మనకు ఊతం. చేయి పట్టుకుని నడవొచ్చు.. ఓ పాట మనకు స్నేహితురాలు మన కష్టాలు చెప్పుకోవచ్చు.
అది మన ప్రేయసి తన ఒళ్లో మన తలను పెట్టుకుని ప్రేమను పొందవచ్చు. మన గురువు.. మనకు అవసరం వచ్చినప్పుడు మనకు జ్ఞానాన్ని బోధిస్తుంది అలాంటి పాటను ఇచ్చిన వారిని గౌరవించాలనిపించింది. అందుకే దీనికి మ్యూజికల్ నైట్ పేరు పెట్టి కండక్ట్ చేశాం. ఈ కోరికను బలంగా మన ముందుకు తీసుకొచ్చింది అల్లు అర్జున్. జులాయిలో పెళ్లి కానీ అబ్బాయిగా తెలుసు. ఇప్పుడు ఇద్దరి పిల్లల తండ్రిగా తన తాలూకు మెచ్యూరిటీని తన మాటలు, జీవితంలో, పనిలో ప్రతి దాంట్లో పెడుతున్నాడు. మేం కనే కల మీ అందరికీ మంచి జ్ఞాపకం కావాలి. దీని కోసం మేం ఎంత సాహసంగా నిర్ణయాలు తీసుకున్నా, మీ వెనుక మేం ఉన్నామంటూ అరవింద్‌గారు, చినబాబు గారు నిలబడి మేం అడిగినదల్లా గొప్పగా ఇచ్చారు. ఇంత గొప్ప సంగీతాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఏదో రకంగా మనసుకు దగ్గరైన వాళ్లే. వాళ్లందరికీ నేను చెప్పే మాట ఒకటే.. వాళ్లందరితో నేను ప్రేమలో ఉన్నాను. ఈ సినిమా రిలీజ్ తర్వాత కొద్దిపాటి విరహాన్ని అనుభవిస్తాను. మళ్లీ ఓ కథను రాస్తాను. మళ్లీ మిమ్మల్ని కలుస్తాను. ఈ సినిమాకు మొదలు, చివర అల్లు అర్జునే.
ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏదీ చేసినా హ్యాపీగా చేద్దాం సార్ అని అన్నాడు. అప్పటి నుండి 11 నెలలు పాటు ఈ జర్నీ చేశాం. మేం కాకినాడలో షూటింగ చేస్తున్నప్పుడు పాటల లిరికల్ వీడియోలు రొటీన్‌గా ఉన్నాయి. పాట కోసం పనిచేసి టెక్నీషియన్స్ కనిపించేలా ఏదైనా కొత్తగా చేద్దామని ఆయన అన్నారు. అదే మీరు చూసిన సామజవరగమన పాట.. అలా నాతో సహా అందరినీ ఎంతో ఇన్‌స్పైర్ చేశారు. తొలిసారి నాసినిమాలో స్టార్లు అల్లు అయాన్, అర్హ కూడా నటించారన్నారు. అల్లు అర్జున్ లైఫ్‌లో ఇంకా చాలా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఆ ప్రయాణంలో మేం కూడా భాగమవుతాం. మేం పనిచేయలేని సినిమాలకు మేం సాక్షులమవుతాం, ప్రేక్షకులమవుతాం. మేం పనిచేసే సినిమాలకు దర్శకులమవుతాం. అందరి ప్రేమ మాపై ఇలాగే ఉండాలి. 12న కలిసి పండగ చేసుకుందాం. ఆనందంగా ఉంది. అల వైకుంఠపురములో మీకు స్వాగతం పలుకుతుంది`` అన్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ - ````ఎంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్.. ఇవ్వలా వచ్చింది`` ఇది డైలాగ్ కాదు, నా జీవితంలో జరిగిన సంఘటనే. ఎందుకింత గ్యాప్ తీసుకున్నారని అందరూ అడిగారు. వారికి నేను చెప్పేది ఒకటి. నా మూడు చిత్రాలు సరైనోడు, డీజే , నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అయిన తర్వాత చాలా సరదా సినిమా చేయాలి. ఈజ్ ఉండాలి. ఎన్ని కథలు విన్నా సుఖం రాలేదు. అలాంటి కథ సెట్ కావడానికి త్రివిక్రమ్‌గారు సిద్ధమవటానికి .. సినిమా చేయడానికి ఇంత టైమ్ పట్టింది. అందుకే ఈ గ్యాప్. రిలీజ్‌లో గ్యాప్ ఉంటుందేమో కానీ.. సెలబ్రేషన్స్‌లో గ్యాప్ ఉండదు. ఖాళీ ఉన్న రోజుల్లో మా ఆవిడతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ ప్రోగ్రామ్స్‌కు వెళ్లేవాడిని. ఇంటికొచ్చిన తర్వాత ఈ మ్యూజిక్ బ్యాండ్స్ అందరూ నా నెక్ట్స్ సినిమాలో ప్లే చేయాలని అనుకునేవాడిని. ఆ విషయాన్ని మా ఆవిడకు చెబితే.. అంత పాట పడాలి కదా! అనేది. ఈ సినిమాషూటింగ్ స్టార్ట్ అయ్యింది. మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలో లవ్ సిట్యుయేషన్ సాంగ్ వచ్చినప్పుడు అందరూ ఎలాంటి సాంగ్ ఉండాలనుకుంటున్నారని నన్ను అడిగారు. దానికి నేను అదేమో తెలియదండి.. అందరూ మ్యూజిక్ బ్యాండ్స్ వాళ్లు ఉండాలని అన్నాను. అందరికీ పిచ్చెక్కి పోయే సాంగ్ కావాలని నేను అనగానే తమన్ సామజవరగమన సాంగ్‌ను వినిపించాడు. సిరివెన్నెలగారు, సిద్ శ్రీరామ్‌గారి వల్ల ఆ పాట స్థాయి ఎంతో పెరిగింది. సాంగ్ బాగా వచ్చిందని అనుకున్నాను కానీ.. ఈ పాట ఇంత సెన్సేషన్ అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. అంత గొప్ప పాట రాసిన సీతారామశాస్త్రిగారు, పాడిన సిద్‌శ్రీరామ్‌కి, పాట కంపోజ్ చేసిన తమన్‌కి, ఐడియా ఇచ్చిన త్రివిక్రమ్ గారితో సహా పాటకు పనిచేసిన టెక్నీషియన్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ రాసిన ప్రతి ఒక్క లిరిక్ రైటర్ కి థ్యాంక్స్. తమన్‌తో నాది హ్యాట్రిక్ ఆల్బమ్. ఇరగదీసే మ్యూజిక్ ఇచ్చాడు తమన్.
ఈ సినిమా సంగీతం వల్ల తన రేంజ్ మరో రేంజ్‌కు వెళ్లింది. పి.ఎస్.వినోద్ గారికి థ్యాంక్స్. చాలా అందంగా చూపించారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌గారికి, ఎడిటర్ నవీన్‌గారికి, డాన్స్ మాస్టర్స్‌కి, రామ్ లక్ష్మణ్‌గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. నటీనటుల విషయానికి వస్తే మురళీశర్మగారు అద్భుతమైన పాత్రను పోషించారు. మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. జయరాంగారు ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. అలాగే జేబీ అనే మరో మలయాళ యాక్టర్ నటించారు. సునీల్, రాహుల్ రామకృష్ణకి థ్యాంక్స్. సుశాంత్‌కి స్పెషల్‌గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తనొక హీరో. తను చేసిన ఈ పాత్రలో తను చేస్తే బావుంటుందని భావించి అడగ్గానే కథ కూడా వినలేదు. నమ్మి చేశాడు. తనకు స్పెషల్ థ్యాంక్స్. పూజా హెగ్డేతో రెండోసారి నటించాను. చాలా అందంగా నటించింది. నివేదా పేతురాజ్.. చక్కగా నటించింది. టబు గారి గురించి చెప్పాలంటే.. ఆవిడ పెర్ఫార్ మెన్స్‌కు నేను పెద్ద అభిమానిని. నేషనల్ అవార్డ్ విన్నర్. ఆమెతో కలిసి నటించడం ఎంజాయ్ చేశాను. రావురమేశ్, రాహుల్ రామకృష్ణ, రోహిణి, ఈశ్వరీగారు సహా అందరికీ థ్యాంక్స్. నిర్మాతలు రాధాకృష్ణగారికి, వంశీకి థ్యాంక్స్. జులాయితో ప్రారంభమైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తర్వాత ఎన్నో మంచి చిత్రాలు చేశారు. మధ్యలో వారితో నేను సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేశాను. వారితో కలిసి నటిస్తోన్న మూడో సినిమా. చినబాబుగారు మా తప్పులను భరించారు. ఆయనకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్. త్రివిక్రమ్‌గారి గురించి చెప్పాలంటే.. ఇంత మందిని కలిపి ఆనందం ఇచ్చేది డైరెక్టరే. మేం టూల్స్ అయితే. వాటిని ఉపయోగించుకునే వారు డైరెక్టర్ మాత్రమే. అలాంటి త్రివిక్రమ్‌గారితో మూడో సారి కలిసి పనిచేశాను. ఆయనంటే అంతిష్టం. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే బలమైన కారణం ఆయన.
నాకు మంచి హిట్ సినిమాలు ఇచ్చారు. నా ప్రతి ఇష్టాన్ని త్రివిక్రమ్‌గారు ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా ఎంత చేసినా, ఎంత పేరు తెచ్చుకున్నా అది త్రివిక్రమ్‌గారి వల్లే. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్న గురించి నేను, నాగురించి నాన్న ఎప్పుడూ స్టేజ్‌పై చెప్పుకోలేదు. నన్ను హీరోగా లాంచ్ చేసింది నాన్నే . సభాముఖంగా ఆయనకు ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోలేదు. కానీ ఈరోజు ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ థ్యాంక్స్ కేవలం నాతో సినిమా చేసినందుకే కాదు.. కొడుకు పుట్టిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే. నేను మా నాన్నంత గొప్పగా ఎప్పుడూ కాలేను. ఆయనలో సగం కూడా కాలేను. నాన్నలో సగం ఎత్తుకు ఎదిగితే చాలనే ఫీలింగ్ కలుగుతుంది. మా నాన్నను నేను ప్రేమించినంతగా మరెవరినీ ప్రేమించను. నేను ఆర్య సినిమా చేసినప్పుడు అప్పట్లోనే కోటి రూపాయలు సంపాదించుకున్నాను. నాకు డబ్బుకు ఎప్పుడూ లోటు లేదు. అప్పటికీ పెళ్లైన తర్వాత నా భార్యను నేను అడిగింది ఒకే ఒకటి. నాకెన్ని కోట్లు ఉన్నా.. మా నాన్న ఇంట్లోనే ఉంటానని. మా నాన్నంటే అంత ఇష్టం. నేను చాలా మందిని చూసుంటాను. నేను చూసిన వారిలో ది బెస్ట్ పర్సన్ మానాన్నే. పది రూపాయల వస్తువుని ఏడు రూపాయలకు బేరం చేసిన తర్వాత ఆరు రూపాయలు ఇవ్వండి అన్నా.. వాళ్లింటికి వెళ్లి ఏడు రూపాయలు ఇచ్చేసే వ్యక్తి మా నాన్నగారు. 45 ఏళ్లుగా ఓ వ్యక్తి సినిమాలు, వ్యాపారం చేస్తున్నారు. మనిషిలో ప్యూరిటీ లేకపోతే మనిషి ఇవాళ సౌత్ ఇండియాలో, ఇండియాలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ క్రింద ఉండలేరు.
మా తాతగారికి పద్మశ్రీ వచ్చింది. నిర్మాతగా మా నాన్న కూడా పద్మశ్రీ కి అన్నివిధాలా అర్హులు.. కాబట్టి మా నాన్నకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని సభావేదిక నుండి ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంత గ్యాప్ వచ్చిన కూడా నా ఫ్యాన్స్ కారణంగానే నాకు ఈ గ్యాప్ వచ్చినట్లు అనిపించలేదు. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. కానీ నాకు మాత్రం ఆర్మీ ఉంది. నాకు చిరంజీవి గారంటే ప్రాణం. ఈ కట్టె కాలేంత వరకు చిరంజీవిగారి అభిమానినే. చిరంజీవిగారి తర్వాత నాకు ఇష్టమైన వ్యక్తి రజినీకాంత్ గారే. అలాంటి రజినీకాంత్‌గారి సినిమా రిలీజ్ అవుతుంది. నాకు ఇష్టమైన డైరెక్టర్ మురుగదాస్ గారు చేసిన సినిమా. ఈ సంక్రాంతికి ఆయన సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే మా సినిమాతో పాటు సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా విడుదలవుతుంది. మహేష్ గారు సహా ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. అలాగే నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి కల్యాణ్‌రామ్‌గారి 'ఎంతమంచివాడవురా' సినిమా విడుదలవుతుంది. ఆయనకు కూడా అభినందనలు. ఈ సంక్రాంతి అందరికీ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు శిరీష్,అల్లు బాబీ, బన్నీవాస్, రోహిణి, సముద్రఖని, కృష్ణ చైతన్య, శివమణి, కాసర్ల శ్యామ్, ఎ.ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments