ఓటీటీలో అక్ష‌య్‌కుమార్ మూవీ..?

  • IndiaGlitz, [Monday,April 27 2020]

క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా ప‌రిశ్ర‌మ‌కు గ‌డ్డుకాలం న‌డుస్తుంద‌నే చెప్పాలి. ఎందుకంటే ఓ ప‌క్క సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమాలు రిలీజ్‌లు ఆగిపోయాయి. ఇది నిర్మాత‌లకు పెద్ద సంక‌టంగా మారింది. ఎందుకంటే సినిమాను అనుకున్న టైమ్‌లో రిలీజ్ చేయ‌క‌పోతే ఫైనాన్సియ‌ర్స్ నుండి వారికి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే సినిమాలు థియేట‌ర్స్‌లో విడుద‌ల కావ‌డం అంత సుల‌భంగా క‌నిపించ‌డం లేదు. అస‌లు థియేట‌ర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయ‌నే దానిపై ఎవ‌రికీ క్లారిటీ లేదు. ఒక‌వేళ క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గినా ఒకేసారి స‌డ‌లింపు ఉండ‌దు. ద‌శ‌ల వారిగానే స‌డ‌లింపు ఉంటుంది. ఈ సడ‌లింపుల్లో సినిమా థియేట‌ర్స్‌, మాల్స్‌కు చివ‌రి స్థానం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. దీంతో నిర్మాత‌లు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషిస్తున్నారు.

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. ఈ క‌రోనా టైమ్‌లో ఓటీటీల‌కు వ్యూవ‌ర్స్ పెరిగారు. దీంతో నిర్మాత‌లు త‌మ సినిమాల‌ను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారని, ఆ దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. తాజా సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ..అక్ష‌య్ కుమార్ హీరోగా రాఘ‌వ లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హార‌ర్ థ్రిల్ల‌ర్ కామెడీ చిత్రం ల‌క్ష్మీబాంబ్ రూపొందుతోన్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని థియేట‌ర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుద‌ల చేస్తార‌ని, ఆ దిశ‌గా నిర్మాత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.