Akhil Akkineni:ది బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నించాం .. కానీ : ఏజెంట్ డిజాస్టర్‌పై స్పందించిన అఖిల్
- IndiaGlitz, [Monday,May 15 2023]
అక్కినేని కుటుంబంలో మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు అఖిల్. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా అఖిల్‌కు మాత్రం సరైన హిట్ దక్కడం లేదు. మధ్యలో ఒకటి రెండు సినిమాలు విజయం సాధించినప్పటికీ.. చెప్పుకోగదగ్గ స్థాయిలో కమర్షియల్ హిట్ మాత్రం అఖిల్ ఖాతాలో పడలేదు. అయితే రెండేళ్లు ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘‘ఏజెంట్’’ మూవీ దారుణ పరాజయాన్ని మూటకట్టుకోవడంతో అఖిల్‌తో పాటు అక్కినేని అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అసలు సినిమా ఫ్లాప్ కావడంతో కృంగిపోయి వున్న దశలో కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు.
మరింత బలంగా తిరిగొస్తా :
ఈ నేపథ్యంలో ఏజెంట్ ఫలితంపై అఖిల్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఏజెంట్ సినిమా కోసం తమ జీవితాలను అంకితం చేసిన నటీనటుుల, సాంకేతిక సిబ్బందికి అఖిల్ కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు చేతనైన విధంగా ది బెస్ట్ ఇచ్చేందుకే ప్రయత్నించామని.. దురదృష్టవశాత్తూ ఏజెంట్ ప్రేక్షకులను మెప్పించలేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అండగా నిలిచిన నిర్మాత అనిల్ సుంకరకు అఖిల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సినిమాపై నమ్మకం వుంచిన డిస్ట్రిబ్యూటర్లందరికీ .. అండగా నిలిచిన మీడియాకు అఖిల్ థ్యాంక్స్ చెప్పారు. తనను నమ్మిన వారి కోసం మరింత బలంగా తిరిగి వస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఈసారి తప్పు జరగదన్న అనిల్ సుంకర:
అంతకుముందు కొద్దిరోజుల ముందు నిర్మాత అనిల్ సుంకర కూడా ఏజెంట్ డిజాస్టర్‌పై స్పందించారు. మూవీ ఫ్లాప్ కావడానికి పూర్తి బాధ్యతని తామే తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఏజెంట్ విషయంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొని విజయాన్ని అందుకోవాలని అనుకున్నామని.. కానీ సినిమా షూటింగ్‌కు బౌండ్ స్క్రిప్ట్‌తో వెళ్లలేదని, దీని వల్లే ఇప్పుడు ఇలాంటి పరిస్ధితి ఏర్పడిందని సుంకర అభిప్రాయపడ్డారు. తప్పు చేశామని తాము బాధపడటం లేదని.. సినిమా పరాజయాన్ని ఎవరి మీదా వేయకుండా తమ బాధ్యతగానే స్వీకరిస్తామని అనిల్ సుంకర స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్లానింగ్‌తోనే సినిమాకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి తప్పు జరగనీయమని.. తమపై నమ్మకం వుంచిన ప్రతి ఒక్కరినీ అనిల్ క్షమాపణలు కోరారు.
మే 19 నుంచి సోనీ లీవ్‌లో స్ట్రీమింగ్ :
ఇకపోతే.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ , సురేందర్ 2 సినిమాస్ బ్యానర్‌పై ఏజెంట్ తెరకెక్కింది. సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అఖిల్ సరసన సాక్షి వైద్య నటించారు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కోట్లలో నష్టం వచ్చినట్లుగా ఫిలింనగర్ టాక్. మే 19 నుంచి సోనీ లీవ్‌లో ఏజెంట్ స్ట్రీమింగ్ కానుంది.
— Akhil Akkineni (@AkhilAkkineni8) May 15, 2023