బైక్‌పై జారిపడినా మళ్లీ అందుకుని.. అజిత్ ‘‘వాలిమై’’ స్టంట్స్ వీడియో వైరల్

  • IndiaGlitz, [Wednesday,December 15 2021]

ఏ సినిమా చేసినా ప్రాణం పెట్టి చేయడం అజిత్ స్టైల్. తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకడిగా వున్నా... నేటికీ ఆయనలో అదే క్రమశిక్షణ, పట్టుదల. అలాగే స్టంట్స్ సైతం డూప్ పెట్టకుండా తనకు తాను చేయడం అజిత్‌కు అలవాటు. తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్‌ చిత్రం ‘వాలిమై’. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకు హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ నటి హ్యుమా ఖురేషి అజిత్‌తో ఆడిపాడనుండగా.. తెలుగు యువనటుడు కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హాలీవుడ్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కించారని కోలీవుడ్ టాక్.

ఇక స్వతహాగా బైక్ రేసర్ అయిన అజిత్‌తో అద్భుతమైన బైక్‌ స్టంట్స్ చేయించింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో అజిత్‌ బైక్‌ స్టంట్లకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను మంగళవారం మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వీడియోలో అజిత్‌ తొలుత బైక్‌ నడుపుతూ ప్రమాదవశాత్తూ పడిపోతారు. అయినా మళ్లీ లేచి బైక్‌పై స్పీడ్‌గా దూసుకెళ్తారు తలా. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా.. అజిత్‌, శివ కాంబినేష‌న్లో వ‌చ్చిన నాలుగు సినిమాలు భారీ విజ‌యం సాధించాయి. ఈ త‌రువాత హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నెర్కొండ‌పార్వై సినిమా సైతం ఘన విజ‌యం సాధించింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్‌ ‘‘పింక్’’ సినిమాకు ఇది రీమేక్‌. తాజాగా వినోద్ డైరెక్షన్‌లో వస్తోన్న ‘‘వాలిమై’’పై భారీ అంచనాలున్నాయి.