ఐశ్వర్య గర్భవతి కాదు!
- IndiaGlitz, [Monday,March 25 2019]
అందాల రాశి ఐశ్వర్య గర్భం దాల్చారా? ఆమె మరో సారి తల్లి కాబోతున్నారా? అవునని ఫొటోలు చెబుతుంటే, కాదని ఆమె మీడియా టీమ్ చెబుతోంది. ఇటీవల గోవాలో తన భర్త అభిషేక్ బచ్చన్‌తో కలిసి ఐశ్వర్య బీచ్ వాక్‌కి వెళ్లారు. తన భర్త కన్నా కురచ దుస్తులు వేసుకుని, కళ్లకు గాగుల్స్ పెట్టుకుని ఐశ్వర్య నడుస్తున్నారు.
ఆమె నడుస్తున్న క్రమంలో పొట్ట భాగం కాస్త ఉబ్బెత్తుగా కనిపించింది. దాంతో వెంటనే ఆమె మరోసారి గర్భం దాల్చారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఐశ్వర్య మీడియా టీమ్ మాత్రం అలాంటిదేమీ లేదనీ, లేనిపోని గాలివార్తలు రేపొద్దని గట్టిగా సమాధానమిచ్చాయి. సెలబ్రిటీల వ్యక్తిగతజీవితంలోకి తరచూ తొంగిచూడొద్దని హితవు పలికాయి.
ఐశ్వర్యరాయ్‌కి ఇప్పుడు 45 ఏళ్లు. 2007లో వివాహం చేసుకున్న ఆమెకు ఆరాధ్య తొలిసంతానం. గత కొన్నేళ్లుగా ఐశ్వర్య, అభిషేక్ విడిపోతారనే వార్తలు కూడా బాగానే వచ్చాయి. అవి సద్దుమణిగిన నేపథ్యంలో ఇప్పుడు ఐశ్వర్య గర్భం న్యూస్ బయటికొచ్చింది. అందులో నిజానిజాలు ఏంటో బచ్చన్ కుటుంబం బయటపెట్టేవరకు తెలియవు మరి.