69 ఏళ్ల తర్వాత పుట్టింటికి ఎయిరిండియా.. టాటా గ్రూప్‌కు అప్పగించిన కేంద్రం
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పటి వరకు ప్రభుత్వరంగంలో సేవలందించిన దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా 69 ఏళ్ల తర్వాత పుట్టింటికి చేరుకుంది. ఎయిరిండియా యాజమాన్య హక్కులను అధికారికంగా టాటా గ్రూప్‌కు బదలాయించింది కేంద్రం. బిడ్డింగ్‌లో ఎయిరిండియాను దక్కించుకున్న టాటా అనుబంధ సంస్థ ట్యాలెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అధికారికంగా ఎయిరిండియాను అప్పగించినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే ప్రకటించారు. ఎయిరిండియా అప్పగింత ప్రక్రియపై టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ హర్షం వ్యక్తం చేశారు. టాటా గ్రూప్ ఉద్యోగులుగా మారనున్న ఎయిరిండియా ఉద్యోగులను ఆయన సంస్థలోకి ఆహ్వానించారు.
1932లో టాటా ఎయిర్‌లైన్స్ పేరిట జేఆర్డీ టాటా దీనిని ప్రారంభించారు. 1953లో జాతీయీకరణతో ఈ సంస్థ ప్రభుత్వ పరమైంది. అయితే, 1977 వరకు టాటాయే సంస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించింది.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే వేలం ప్రక్రియను నిర్వహించింది. ఎయిరిండియాను దక్కించుకునేందుకు దిగ్గజ సంస్థలు సెప్టెంబర్ 29న బిడ్లు దాఖలు దాఖలు చేశాయి. బిడ్ మొత్తంలో ఎయిరిండియా రుణాలకు 85 శాతం, నగదుగా 15 శాతం బిడ్డర్లు చెల్లించాల్సి ఉంటుంది. రేసులో టాటా సన్స్‌తో పాటు స్పైస్‌జెట్ అధిపతి అజయ్ సింగ్ కూడా ఉన్నారు. ప్రభుత్వం ఇటీవల ఎయిరిండియా ‘మినిమం రిజర్వ్ ప్రైస్’ ఖరారు చేసింది. భవిష్యత్తులో క్యాష్ ఫ్లో అంచనాలు, బ్రాండ్ విలువ, విదేశీ విమానాశ్రయాల్లో స్లాట్ల ఆధారంగా రిజర్వ్ ప్రైస్‌ను రూ.12,906 కోట్లుగా నిర్ణయించారు. టాటా సన్స్ బిడ్‌లో కోట్ చేసిన రూ.18,000 కోట్లు.. రిజర్వ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంది. రూ.18,000 కోట్లలో రూ.15,300 కోట్ల రుణాలను టాటా సన్స్ తమ చేతుల్లోకి తీసుకోనుంది. మిగిలిన రూ.2,700 కోట్లను నగదు రూపంలో ప్రభుత్వానికి చెల్లించనుంది.
ఈ నేపథ్యంలోనే టాటా సన్స్‌ను విజయవంతమైన బిడ్డర్‌గా ఎంపిక చేసినట్లు కేంద్ర పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (డీఐపీఏఎం-దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే గతేడాది అధికారికంగా ప్రకటించారు. ఎయిరిండియాలో 100 శాతం వాటాలతో పాటు.. అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సైతం పూర్తిగా టాటాలపరం కానుంది. అలాగే గ్రౌండ్ హాండ్లింగ్ కంపెనీ ‘ఎయిరిండియా శాట్స్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఐఎస్ఏటీఎస్)’లోనూ టాటాలకు 50 శాతం వాటాలు దక్కనున్నాయి.
2021 ఆగస్టు చివరి నాటికి సంస్థకు రూ.61,562 కోట్ల రుణ భారం ఉండగా, విజయవంతమైన బిడ్డరు రూ.15,300 కోట్లను చెల్లించాల్సి వుంటుంది. మిగిలిన రూ.46,262 కోట్ల రుణభారాన్ని ఎయిరిండియా అసెట్ హోల్డింగ్ (ఏఐఏహెచ్ఎల్)కు బదిలీ చేస్తారు. దేశీయ విమానాశ్రయాల్లో దేశీయ ప్రయాణాలకు 4400, అంతర్జాతీయ ప్రయాణాలకు 1800 ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్లు ఎయిరిండియాకు ఉన్నాయి. విదేశీ విమానాశ్రయాల్లో 900 స్లాట్లున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియాలో ఉన్న ఉద్యోగులందరినీ టాటా సన్స్ ఏడాది పాటు విధుల్లో కొనసాగించాలి. రెండో ఏడాది వారికి స్వచ్ఛంద ఉద్యోగవిరమణకు అవకాశం ఇవ్వొచ్చు. అయితే ఎయిరిండియా బ్రాండ్‌ను, లోగోను ఐదేళ్ల వరకు టాటా సన్స్ ఇతరులకు బదిలీ చేయరాదు.. ఒకవేళ చేయాలనుకున్నా భారతీయులకే చేయాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments