కబాలి'కి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఆసియా
- IndiaGlitz, [Saturday,February 16 2019]
ఒక సాధారణ బస్సు కండక్టర్ నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్‌ను యావత్ ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఒక్క తెలుగు, తమిళ్‌లోనే కాదు అన్ని దేశాల్లో రజనీకి అభిమానులున్నారు. సూపర్‌స్టార్ సినిమా థియేటర్లలోకి వచ్చిదంటే ఒక టాలీ, కోలీవుడ్ ఇండస్ట్రీల్లోనే కాదు.. విదేశాల్లో సైతం సూపర్ డూపర్ హిట్టయిన సందర్భాలు కోకొల్లలు. ఇందుకు ప్రత్యేకంగా ఉదహరించి చెప్పనక్కర్లేదు. వయసు అయిపోతోంది ఆయనకే గానీ.. ఆయన స్టైల్, నటనకు కాదని.. ఈ వయస్సులో కూడా మా అభిమాన హీరో యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా.. 2016లో రంజిత్ కుమార్ దర్శకత్వంలో.. సూపర్‌స్టార్ హీరోగా వచ్చిన చిత్రం ‘కబాలి’. ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీగానే రాబట్టింది. అప్పట్లో ‘కబాలి’ ఏ రేంజ్‌లో ప్రమోషన్లు చేశారో మనందరికీ తెలసిందే. ఎయిర్ ఏషియా సంస్థ సొంత విమానాలపై ‘కబాలి’ క్యాన్వాస్‌ను ముద్రించడం అప్పట్లో సంచలనమే. అన్ని సినిమాలకు పోస్టర్లు, టీవీలు, పత్రికల రూపంలో యాడ్స్ ఇస్తే.. ఏకంగా గాల్లోనే కబాలిని ప్రమోట్ చేశారు!.
ఈ సినిమాకు సంబంధించి ఒక వినూత్నమైన గిఫ్ట్ ఇవ్వాలని భావించిన ‘కబాలి’నిర్మాణంలో భాగమైన ఎయిర్ఆసియా సంస్థ.. మరిచిపోలేని బహుమతిని ఇచ్చింది. ఇటీవల చెన్నైలోని రజనీ ఇంటికెళ్లిన ఎయిర్ఆసియా- ఇండియా సీఈఓ సునీల్ భాస్కరన్.. విమానంను గిఫ్ట్‌గా ఇచ్చారు. విమానం అంటే రియల్‌ది కాదు బొమ్మలాంటిది. దీనికి ‘కబాలి లివరీ’గా పేరుపెట్టడం జరిగింది. కాగా ఈ విమానంపై అప్పట్లో ప్రమోట్ చేసిన కబాలి పోస్టర్లు ఉన్నాయి. చూడటానికి చూడముచ్చటగా ఉన్న ఈ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రజనీ అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున షేర్‌లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా భాస్కరన్ మాట్లాడుతూ.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్‌కు మంచి గుర్తింపు ఉంది. కబాలి సినిమాలో మేము భాగస్వామ్యులమైనందుకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఈ రకమైన చిత్రం కోసం మేం ఎంతగానో ఎదురుచూస్తున్నాము అని ఆయన చెప్పుకొచ్చారు.
అంతటితో ఆగని ఆయన.. తన సంస్థ పలు ప్రాంతాలకు విమానాలను నడుపుతోందంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పూణే, చండీగఢ్, జైపూర్, గౌహతి, ఇంఫాల్, విశాఖపట్నం, కొచ్చి, కోల్‌కతా, ముంబై, చెన్నై, శ్రీనగర్, బాగ్డోగ్ర, ఇండోర్, హైదరాబాద్, భువనేశ్వర్, రాంచీలతో సహా దేశంలోని అన్ని ప్రాంతాలకు విమానాలు దేశీయంగా నడుస్తున్నాయని తెలిపారు.