చావుకు భయపడను.. ‘‘జడ్’’ కేటగిరీ భద్రతను తిరస్కరించిన అసదుద్దీన్ ఒవైసీ

కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన జడ్‌ కేటగిరీ భద్రతను ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తిరస్కరించారు. తనకు జడ్‌ కేటగిరీ భద్రత అక్కర్లేదన్న ఆయన. అందరిలాగే తాను ‘ఏ కేటగిరీ’ పౌరుడిగానే ఉండాలనుకుంటున్నట్టు వెల్లడించారు. తన వాహనంపై కాల్పుల ఘటనను పార్లమెంట్‌లో ప్రస్తావించిన ఒవైసీ.. చావుకు తాను భయపడబోనని స్పష్టం చేశారు. కాల్పులు జరిపిన వారిని చూసి తాను ఏమాత్రం భయపడనని అసదుద్దీన్ అన్నారు. దాడి చేసిన వారికి యూపీ యువకులు బ్యాలెట్‌ ద్వారా సమాధానం ఇస్తారనీ.. ఉత్తరప్రదేశ్‌లో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. దేశంలో పేదలు, మైనార్టీలకు భద్రత ఉంటే తనకూ ఉన్నట్టేనని చెప్పారు. దేశంలోని పేదలు బాగుంటేనే తానూ బాగుంటానని ఒవైసీ పేర్కొన్నారు. తనపై కాల్పులు జరిపిన వారిని శిక్షించి.. న్యాయం చేయాలని అసదుద్దీన్ కోరారు.

కాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా మీరట్ జిల్లా కిట్టోర్‌లో జరిగిన ప్రచారానికి వెళ్లారు అసదుద్దీన్‌ ఒవైసీ. ప్రచారం ముగించుకుని అనంతరం ఢిల్లీ వెళ్తుండగా.. హాపుర్‌-గాజీయాబాద్‌ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్‌గేటు వద్ద గురువారం సాయంత్రం ఆయన కాన్వాయ్‌పై దుండుగులు మూడు నుంచి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటన నుంచి అసదుద్దీన్ తృటిలో తప్పించుకున్నారు. కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకు పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

ఢిల్లీకి చేరుకున్న అనంతరం అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. తనపై పెద్ద కుట్ర జరిగిందని, అల్లా దయవల్ల బయటపడ్డానని చెప్పారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పీకర్ ఓంబిర్లాను కలిసి ఫిర్యాదు చేస్తానని అసదుద్దీన్ తెలిపారు. యూపీలో మరో వారంలో తొలి విడత ఎన్నికల పోలింగ్‌ జరగనున్న సమయంలో అసదుద్దీన్‌పై కాల్పుల జరగడం అక్కడి రాజకీయాలను వేడెక్కించింది.

ఈ నేపథ్యంలోనే ఆయనకు జడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. 22 మంది భద్రతా సిబ్బందితో పాటు ఒక ఎస్కార్ట్‌ వాహనాన్ని కేటాయించనుంది కేంద్రం. వీరిలో నలుగురి నుంచి ఆరుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసు సిబ్బంది కూడా ఉంటారు.