లాక్‌డౌన్‌పై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ
- IndiaGlitz, [Wednesday,May 12 2021]
తెలంగాణలో లాక్‌డైన్ విధించడంపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది తమ జీవనోపాధిని కోల్పోతారని ట్విటర్ వేదికగా ఆయన పేర్కొన్నారు. చాలా మంది జీవితాలు లాక్‌డౌన్ కారణంగా ప్రమాదంలో పడిపోతాయన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఈ నేపథ్యంలో తెలంగాణ పేదలను మరవకూడదన్నారు. అలాగే లాక్‌డౌన్ కారణంగా వారిని ఇళ్లకే పరిమితం అయినందున వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని అసదుద్దీన్ కోరారు. అలాగే లాక్‌డౌన్ 10 రోజులకు మించి పొడిగించరని కూడా ఆశిస్తున్నామన్నారు.
Also Read: లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు.. ఇతర కీలక నిర్ణయాలివే..
మరోవైపు తెలంగాణలో లాక్‌డౌన్ ప్రారంభమైంది. బుధవారం నుంచి 10 రోజులపాటు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు (నాలుగు గంటలు) కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాలుగు గంటలే సడలింపు ఇవ్వడంతో ఆ సమయంలో మార్కెట్లలో విపరీతమైన రద్దీ కనిపించింది. నిత్యావసరాల కోసం ఉదయం నుంచి జనం క్యూకట్టారు. లాక్ డౌన్ విధించడంతో పలువురు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కనిపించింది.
మంగళవారం కేబినెట్ భేటీ అనంతరం ప్రభుత్వం లాక్ డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. లాక్ డౌన్ సడలింపు సమయంలోనే మెట్రో, ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపబోమని తెలంగాణ ఆర్టీసీ ఎండీ తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదని మార్గదర్శకాల్లో పేర్కొంది.