AIIMS Mangalagiri: రూ.10కే కార్పోరేట్ వైద్యం.. పేదల పాలిట సంజీవనీలా మంగళగిరి ఎయిమ్స్

  • IndiaGlitz, [Wednesday,July 06 2022]

భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఆసుపత్రుల్లో ఎయిమ్స్ కూడా ఒకటి. రాష్ట్రపతి, ప్రధాని , కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రుల వంటి రాజకీయ ప్రముఖులు అనారోగ్యానికి గురైతే తక్షణం అక్కడికే తరలిస్తారు. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఏపీ విభజన తర్వాత .. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైంది. రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి పట్టణంలో కోట్లాది రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు. తొలుత ఔట్ పేషెంట్ సేవలతో ప్రారంభించి.. ఇప్పుడు ఇన్ పేషెంట్ సేవలను కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. చిన్నపాటి జ్వరానికే వేలాది రూపాయలు ఖర్చవుతున్న ఈ రోజుల్లో కేవలం రూ.10కే కార్పోరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తోంది ఎయిమ్స్.

ఈ విభాగాల్లో వైద్య సేవలు:

ఆసుపత్రికి నేరుగా వచ్చి పది రూపాయల కన్సల్టేషన్ ఫీజుతో వైద్యులను కలవొచ్చు. ఈఎన్‌టీ, ఫిజికల్‌ మెడిసన్‌ అండ్‌ రీహబిటేషన్‌, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్ధోపెడిక్స్‌, సైక్రియాట్రి, ఆఫ్తమాలజీ, డెర్మటాలజీ, పెడియాట్రిక్స్‌, ఓబీజీ, డెంటిస్ట్రీ వంటి విభాగాలలో వైద్య సేవలను అందిస్తున్నారు. అయితే న్యూరో విభాగం ఇంకా పూర్తి కాలేదు.. అటు క్యాంటీన్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కేవలం రూ.75కే మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. ఉదయం 9 గంటలకి లోపలికి వెళ్తే.. మధ్యాహ్నానికి బయటకు రావొచ్చు. విజయవాడ నగరాన్ని నుంచి నేరుగా ఎయిమ్స్‌కి సిటీ బస్సులు నడుపుతున్నారు. మంగళగిరి బస్టాండ్ నుంచి బస్సులు, ఆటోలు కూడా అందుబాటులో వున్నాయి. కృష్ణా- గుంటూరు జిల్లాలకు ఆనుకొని వుండే తెలంగాణ జిల్లాల ప్రజలు కూడా ఇక్కడికి సులభంగా చేరుకుని వైద్యాన్ని చేయించుకోవచ్చు.

ఎయిమ్స్‌లో వివిధ టెస్టులు వాటికి అయ్యే చార్జీలు :

బయట 5 నుంచీ 10 వేల రూపాయలు అయ్యే టెస్టులను ఎయిమ్స్‌లో కేవలం 500 నుంచీ 600 రూపాయలకే అందిస్తున్నారు.

కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ రూ.135
ఫాస్టింగ్‌ అండ్‌ ర్యాండమ్‌ బ్లడ్‌ షుగర్‌ రూ.24+24
లివర్‌ ఫంక్షనింగ్‌ టెస్ట్‌ రూ.225
కిడ్నీ ఫంక్షనింగ్‌ టెస్ట్‌ రూ.225
లిపిడ్‌ ప్రొఫైల్‌ రూ.200
థైరాయిడ్‌ ప్రొఫైల్‌ రూ.200
ఈసీజీ రూ.50
ఛాతి ఎక్స్‌రే రూ.60
మామోగ్రఫీ రూ.630
అల్‌ట్రాసోనోగ్రఫీ రూ.323
యూరిన్‌ ఎనాలిసిస్‌ రూ.35
హెచ్‌ఐవీ రాపిడ్‌ టెస్ట్‌ రూ.150
హెచ్‌బియస్‌ ఏజీ రాపిడ్‌ టెస్ట్‌ రూ.128