అన్న‌పూర్ణ స్టూడియోస్‌తో సంయుక్తంగా `ఆహా` ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న న‌యా వెబ్‌సీరీస్ `ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ`

  • IndiaGlitz, [Friday,August 27 2021]

అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ 'ఆహా' త‌మ అభిమాన ప్రేక్ష‌కుల‌ను మ‌రింత‌గా రంజింప‌జేయ‌డానికి మ‌రో అడుగు ముందుకేస్తోంది. ఒరిజిన‌ల్ వెబ్‌సీరీస్ 'ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ'ని త‌మ ప్రేక్ష‌కుల‌కు త్వ‌ర‌లో అందించ‌నుంది. రొమాంటిక్ డ్రామా ఇది. సంతోష్ శోభ‌న్‌, టినా శిల్ప‌రాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 8 నుంచి ప్రీమియ‌ర్ కానుంది. మిడిల్ క్లాస్ యువ‌కుడు విజ‌య్‌. అత‌ని త‌ల్లిదండ్రులు చిన్న బేక‌రీ నిర్వ‌హిస్తుంటారు. అత‌నికి ఫిల్మ్ స్టార్ ఐరా వాసిరెడ్డితో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ప్ర‌పంచం అంతా ఆమె పాదాల ముందు ఉన్నా, ఆమె మాన‌సికంగా ఒంట‌రిగా ఫీల‌వుతుంటుంది. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన రొమాన్సే ఈ వెబ్‌సీరీస్‌. ది బేక‌ర్ అండ్ ది బ్యూటీని జొనాథ‌న్ ఎడ్వ‌ర్డ్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సినిమా రంగంలోని ప‌లు విభాగాల్లో ఆరు ద‌శాబ్దాల చ‌రిత్ర క‌లిగిన అన్న‌పూర్ణ స్టూడియోస్‌తో క‌లిసి ఈ వెబ్‌సీరీస్‌ని నిర్మిస్తోంది.

'ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ' ఫ‌స్ట్ పోస్ట‌ర్‌ని ఆహా వ్య‌వ‌స్థాప‌కులు, స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్, 'ఆహా' సీఈఓ అజిత్ ఠాకూర్‌, నిర్మాత‌, అన్న‌పూర్ణ స్టూడియోస్ సీఈఓ సుప్రియా యార్ల‌గ‌డ్డ క‌లిసి ఆవిష్క‌రించారు. ఇద్దరు భిన్న మనస్కుల మధ్య జరిగే ప్రేమ, ఎమోషన్ వంటి అంశాలతో ఈ స్టోరీ రన్ అవుతుంది. లీడ్ ఆర్టిస్టుల మ‌ధ్య కెమిస్ట్రీ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. మ‌రీ ముఖ్యంగా వాళ్ల జీవ‌న ప్ర‌యాణం, వాళ్ల డెస్టినీస్ అంద‌రినీ అల‌రిస్తాయి.

విష్ణు ప్రియ‌, సాయి శ్వేత‌, సంగీత్ శోభ‌న్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఝాన్సీ ల‌క్ష్మి, వెంక‌ట్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అంత‌ర్జాతీయ స్థాయిలో పాపుల‌ర్ అయిన ది బేక‌ర్ అండ్ ది బ్యూటీని ఆధారంగా చేసుకుని అదే పేరుతో తెర‌కెక్కింది. ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ ఫ‌స్ట్ సీజ‌న్‌కి విమ‌ర్శ‌కుల నుంచి చాలా ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. ఎంతో మంది చూసిన సీజ‌న్ అది. ఈ సీరీస్‌ని తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టు మార్చుకుని, వారి సెంటిమెంట్స్ ని, సెన్సిబిలిటీస్‌ని దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కించారు. తెలుగు మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల్లో క‌నిపించే చిన్న చిన్న ఇబ్బందులు, ఆశ‌లు, జీవితం ప‌ట్ల అభిరుచులు, పెద్దింటి వాళ్ల మ‌న‌సుల్లో ఉండే భావాలు, సునిశిత హాస్యం, సున్నితత్వం వంటివాటిని ప్ర‌తిబింబించే సీరీస్ ఇది.

ప‌క్కా లోక‌ల్ యువ‌కుడికి, అందాల రాశికి మ‌ధ్య చూపించే రొమాన్స్ త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుంది. ప‌ది భాగాలుగా సాగే షో ఇది. ఆహా ప్ర‌తిష్ట‌ను ఇనుమ‌డింప‌జేస్తుంది. ఇండియ‌న్ డిజిట‌ల్ స్పేస్‌లో తొలి సై ఫై క్రైమ్ థ్రిల్ల‌ర్ కుడి ఎడ‌మైతే ఇటీవ‌ల ఆహాలో విడుద‌లైంది. ప‌వ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్ న‌టించిన ఈ షోకి ప్రేక్ష‌కుల నుంచి అత్యంత గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందిన షో ఇది. అంతే కాదు, ఈ ఏడాది ఇప్ప‌టికే క్రాక్‌, లెవ‌న్త్ అవ‌ర్‌, జాంబీరెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, నాంది, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, నీడ‌, కాలా, ఆహా భోజ‌నంబు, ఒన్‌, చ‌తుర్ముఖం వంటి వైవిధ్య‌మైన సినిమాల‌ను, షోల‌ను అందించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందుతోంది ఆహా.

ప్రపంచవ్యాప్తంగ ఆదరణ పొందిన కెషత్‌ ఇంటర్నేషనల్‌ సీరీస్‌ ది బేకర్‌ అండ్‌ ద బ్యూటీని అదే పేరుతో అడాప్ట్ చేసుకుని ఆహా ఈ వెబ్‌సీరీస్‌ని తెరకెక్కించింది. ఒరిజినల్‌ సీరీస్‌కి విస్తృతమైన గుర్తింపు దక్కింది. ''అన్నపూర్ణ స్టూడియోస్‌తోనూ, ఆహాతోనూ కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మా ది బేకర్‌ అండ్‌ ది బ్యూటీని తెలుగు ఆడియన్స్ కి అందించడం ముదావహం. ఆహా, అన్నపూర్ణ స్టూడియోస్‌, కెషత్‌ ఇంటర్నేషనల్‌ కలిసి సరిహద్దులు చెరిపేసే లోకల్‌ ఫ్లేవర్‌ ఉన్న కంటెంట్‌ని అందించడం చాలా హ్యాపీగా ఉంది. ది బేకర్‌ అండ్‌ ద బ్యూటీ షోలో ఏ పాత్రకు ఆ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అత్యంత అందమైన లక్షణాలతో అలరిస్తుంది. అచ్చమైన తెలుగు కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్‌ కావడం లేదనే విషయం అర్థమైంది. భవిష్యత్తులోనూ ఇలాంటి మంచి సంస్థతో కలిసి పలు ప్రాజెక్టులకు పనిచేసి, గుర్తుండిపోయే షోస్‌ని అందించాలని అనుకుంటున్నాం'' అని కెషత్‌ ఇంటర్నేషనల్‌కి చెందిన కెల్లీ రైట్‌ అన్నారు.

''ఆహాని ప్రారంభించినప్పటి నుంచి క్వాలిటీ కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించాలనే ప్రాథమిక లక్ష్యంతో పనిచేస్తున్నాం. విరివిగా కంటెంట్‌, తెలుగు లో వెబ్‌ ఒరిజినల్స్, అభిరుచి గల సినిమాలతో ఎల్లప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తొలి డిజిటల్‌ సైఫై క్రైమ్‌ థ్రిల్లర్‌ కుడి ఎడమైతే అత్యంత ప్రేక్షకాదరణ పొందింది. ఎందరికో తియ్యటి గతాన్ని గుర్తుచేసే స్మాల్‌ టౌన్‌ టీనేజ్‌ రొమాన్స్ ని పోట్రే చేసిన తరగతి గది దాటి సునిశితమైన విమర్శకుల ప్రశంసలను పొందింది. ప్రాథమికదశలోనే ఇన్ని రకాలుగా ఆకట్టుకుంటున్న ఆహా భవిష్యత్తులో సినిమాల విషయంలోనూ, ఒరిజినల్స్ విషయంలోనూ, వెబ్‌ షోస్‌ విషయంలోనూ ఎక్కడా రాజీ పడదన్న విషయాన్ని మరొక్కసారి గట్టిగా చెబుతున్నాను. ది బేకర్‌ అండ్‌ ది బ్యూటీతో సుప్రియ (యార్లగడ్డ)తో అసోసియేట్‌ కావడం చాలా ఆనందంగా ఉంది. ఆరు దశాబ్దాలుగా సినీ రంగంలో పలు శాఖల్లో అగ్రగామిగా ఉన్న అన్నపూర్ణలాంటి ఘన చరిత్ర కలిగిన ప్రొడక్షన్‌ హౌస్‌తో చేతులు కలపడం మంచి పరిణామం. సంతోష్‌ శోభన్‌, టీనా శిల్పరాజ్‌, విష్ణుప్రియ నటనను చూసి ప్రతి ఒక్కరూ మెచ్చకుంటారు. వారికి ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది'' అని ఆహా వ్యవస్థాపకులు అల్లు అరవింద్‌ అన్నారు.

న‌టీన‌టులు: సంతోశ్ శోభ‌న్‌, టీనా శిల్పారాజ్‌, విష్ణు ప్రియ‌, సంగీత్ శోభ‌న్‌, సాయి శ్వేత‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, ఝాన్సీ ల‌క్ష్మీ, వెంక‌ట్ త‌దిత‌రులు