పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా అంటే అందరిలో ఎంతటి ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు కారణం చెప్పనక్కర్లేదు.. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన జల్సా సూపర్‌హిట్ అయితే, అత్తారింటికి దారేది సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించింది. ముచ్చటగా మూడోసారి వీరికలయికలో వచ్చిన సినిమా `అజ్ఞాతవాసి`. ఈ సినిమా విడుదలకు ముందు నుండే అందరిలో ఆసక్తిని రేపింది. అందుకు తగినట్లు టీజర్, పవన్ పాడిన పాట, ట్రైలర్ ఈ అంచనాలను రెట్టింపు చేశాయి. మరి సంక్రాంతి సందర్భంగా విడుదలైన అజ్ఞాతవాసి ఈ అంచనాలను అందుకుందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం..
కథ:
గోవింద్ భార్గవ్ విందా (బొమన్ ఇరానీ) చిన్న స్థాయి నుండి ఏబీ గ్రూప్ అనే ఐదు వేల కోట్ల పెద్ద కంపెనీ అధిపతి స్థాయికి ఎదుగుతాడు. అతనికి డబ్బు, పలుకుబడి పెరిగినట్లే..శత్రువులు కూడా పెరుగుతారు. గోవింద్ ఎదుగుదలను ఓర్వలేని ప్రత్యర్థులు అతన్ని, అతని కొడుకును హత్య చేస్తారు. సీతారాం (ఆదిపినిశెట్టి) ఈ హత్యలను వెనుకుండి నడిపిస్తాడు. అందుకు కారణం తనకున్న అధికార దాహం. ఎలాగైనా ఏబీ కంపెనీని హస్తగతం చేసుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో విందా భార్య ఇంద్రాణి (ఖుష్బూ) కోరిక మేర ప్రపంచానికి తెలియని, అజ్ఞాతంలో ఉండే..విందా పెద్ద కొడుకు అభిషిక్త్ భార్గవ్(పవన్ కల్యాణ్) సీన్‌లోకి వస్తాడు. తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలో తన కంపెనీలోకి తనే ఓ ఎంప్లాయిగా జాయిన్ అవుతాడు. తన తల్లి ఇంద్రాణిపై జరిగే హత్య కాండను కూడా ఆపిన భార్గవ్ ఇక రంగంలోకి వస్తాడు. సి.ఇ.ఒ కావాలనుకున్న అభిషిక్త్‌కి ..తనని విందా కొడుకు ప్రూవ్ చేసుకుంటే అది సాధ్యమని కండీషన్ పెడతాడు సీతారాం. అప్పుడు అభిషిక్త్ ఏం చేస్తాడు? అసలు సీతారాం నుండి తన కంపెనీని ఎలా కాపాడుకున్నాడు? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
- పవన్ కల్యాణ్
- పాటలు
- సినిమాటోగ్రఫీ
- డైలాగ్స్
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- బలమైన కథనం లేకపోవడం
- కథలోని ఫోర్స్ తగ్గుతూ, పెరుగుతూ రావడం
- అనవసరమైన సన్నివేశాలను ఎడిటింగ్‌లో తొలగించకపోవడం
- హీరోయిన్స్ పాత్రలు డిజైనింగ్ సరిగా లేకపోవడం
- నేపథ్య సంగీతం
విశ్లేషణ:
ఓ కంపెనీ ఉన్నతస్థాయికి ఎదగడం..దాన్ని వశం చేసుకోవాలని ప్రత్యర్థులు ప్రయత్నించడం. హీరో కుటుంబాన్ని అంతు చూసే క్రమంలో అతని తండ్రిని, సోదరుడిని చంపేయడం..రంగంలోకి దిగిన హీరో తన కుటుంబాన్ని, కంపెనీని కాపాడుకోవడం. సింపుల్‌గా చెప్పాలంటే ఇదే కథ. ఇలాంటి కథలు తెలుగు తెరపై చాలానే వచ్చాయి. మరి కథనం విషయంలో త్రివిక్రమ్ ఏమైనా మాయ చేశాడా ? అంటే లేదనే చెప్పాలి. పవన్ వంటి హీరో, భారీ బడ్జెట్ పెట్టగల నిర్మాత ఉన్నప్పుడు త్రివిక్రమ్ ఎక్కడో మిస్ ఫైర్ చేశాడనిపించింది సినిమా చూసి. రచయితగా తనదైన మార్కును చూపించిన త్రివిక్రమ్ ఓ ఫోర్స్‌తో కథను నడిపించడంలో విఫలమయ్యాడు. కుందేళ్లు కులాసాగా ఉన్నాయి. సింహం సరదాగా రావచ్చు.., విందా సామాన్యుడు కాడు..సాయంకాలం పెద్దగా కనపడే నీడలాంటివాడు...హీరో విలన్స్‌ను సైలెంట్‌గా మట్టుబెట్టే సమయంలో చెప్పే నకుల ధర్మంలోని డైలాగ్స్, విచ్చలవిడిగా నరకడం హింస అయితే..విచక్షణతో నరకడం ధర్మం అవుతుంది. మాకు సంతోషమైనా, బాధైనా నిశ్శబ్ధంగానే చేయడం తెలుసు...ఎప్పుడూ జరిగితే అనుభం ఎప్పుడో జరిగితే అద్భుతం..ఇలాంటి డైలాగ్స్ చాలానే ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఇక అనిరుధ్ ట్యూన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావున్నాయి. మణికందన్ సినిమాటోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీ. ప్రతి సీన్ చాలా రిచ్‌గా కనపడింది. నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనపడిందనాలి. యాక్షన్ సీక్వెన్స్‌లు సన్నివేశాలకు తగినట్టున్నాయి. పాటల్లోని ట్యూన్స్‌కు తగ్గట్లు పవన్ సింపుల్ డాన్స్‌లు చేశాడు. ఇక పవన్ పాడిన కొడకా కొటేశ్వరరావు పాట ఆకట్టుకుంటుంది. రావు రమేష్, మురశీ శర్మ కామెడీ ట్రాక్ బావుంది. అలాగే వెన్నెలకిషోర్ కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. సినిమా సాగదీసినట్లు అనిపించింది. హీరోయిన్స్ క్యారెక్టర్స్ డిజైన్ చేసిన తీరు..వారి మధ్య గొడవలు జరిగే సన్నివేశం అన్ని ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. సినిమాలో కొన్ని సన్నివేశాలు అత్తారింటికి దారేది చిత్రాన్ని గుర్తుకు తెస్తాయి. పవన్ తన మార్కు నటన, డైలాగ్ డెలివరీతో సినిమాను ముందుండి నడిపించాడు. లుక్స్ పరంగా పవన్ బాగున్నాడు. బొమన్ ఇరానీ పాత్ర పరిమితం. ఆయన పాత్రకు న్యాయం చేశాడు. స్టాలిన్ తర్వాత తెలుగులో ఖుష్బూ చేసిన ఈ సినిమాలో చాలా హుందాగా ఉండే పాత్రలో నటించింది. హీరోయిన్స్ కీర్తిసురేష్, అను ఇమాన్యుయేల్ పాత్రల్లో నటనకు పెద్దగా స్కోప్ లేదు. ఇక విలన్‌గా నటించిన ఆది పినిశెట్టి స్టైలిష్ విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. అజయ్, జయప్రకాష్, శ్రీనివాసరెడ్డి, నర్రా శ్రీనివాస్, తనికెళ్లభరణి, నరేన్ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సంక్రాంతి సెలవులు కలిసి రావడం..పవన్‌కున్న ఫాలోయింగ్, టేకింగ్, బెస్ట్ డైలాగ్స్ అన్ని సినిమా కలెక్షన్స్ భారీగా రావడంలో బాగా దోహదం చేస్తాయి.
చివరగా... అభిమానులను ఆకట్టుకునే 'అజ్ఞాతవాసి'
Agnyaathavasi Movie Review in English
Comments