Agent Sai Srinivasa Athreya Review
నవీన్ పొలిశెట్టి తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ , నేనొక్కడినే చిత్రాల్లో ఆయన కనిపించారు. తాజాగా ఆయన హీరోగా ఫుల్ లెంగ్త్ సినిమా `ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ`. కొత్త దర్శకుడు స్వరూప్ చెప్పిన కథతో ఈ సినిమా చేశాడు నవీన్. ఏజెంట్ సినిమా అనగానే ఎవరికైనా తెలుగులో `చంటబ్బాయి` గుర్తుకొస్తుంది. అయితే `చంటబ్బాయి`ని క్లాసిక్ అని, ఆ సినిమా జోలికి పోకుండా, తమంతట తామే తమ స్టైల్‌లో ఈ సినిమాను చేసినట్టు యూనిట్ చెప్పింది. చాన్నాళ్ల తర్వాత సుమంత్‌కు హిట్ ఇచ్చిన చిత్రం `మళ్లీరావా` ఆ సినిమాను రూపొందించిన నిర్మాణ సంస్థ స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను కూడా తెరకెక్కించింది. యూనిట్ చెబుతున్నట్టు ఈ సినిమా ఆడియన్స్ కి థ్రిల్ కలిగిస్తుందా? ఏజెంట్ ఏం చేశాడు? దేన్ని కనుక్కున్నాడు? ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు? లెట్స్ గో త్రూ దిస్...
కథ:
సాయిశ్రీనివాస్ ఆత్రేయ (నవీన్ పొలిశెట్టి) చదువుతుండగా అతని తల్లి చనిపోతుంది. మావయ్య ఆ వార్తను చెప్పడంతో నెల్లూరుకు వచ్చేస్తాడు ఆత్రేయ. అక్కడే ఓ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పెట్టుకుంటాడు. తన తొలి ప్రేయసి ఫాతిమా గుర్తుగా ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని పెట్టి, షార్ట్ ఫార్మ్ గా ఎఫ్‌బీఐ అని అందరికీ చెబుతుంటాడు. అక్కడ అతనికి ఓ అసిస్టెంట్ స్నేహ (శ్రుతి శర్మ) ఉంటుంది. ఆమెకు ఇన్వెస్టిగేషన్ అంటే ఆసక్తి. దాంతో ఆత్రేయ దగ్గర నేర్చుకుంటూ ఉంటుంది. చిన్నా చితకా కేసులు సాల్వ్ చేసుకుంటున్న ఆత్రేయకు ఉన్నట్టుండి ఓ పెద్ద కేసు దొరుకుతుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ తను ఆ ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటాడు. ఇంతకీ అతను సాల్వ్ చేయాలనుకున్న కేసు ఏంటి? అతను ఇద్దరిని ఫాలో అయితే, ఆ ఇద్దరూ ఎందుకు చనిపోయారు? వారిని చంపిందెవరు? రైల్వే ట్రాక్‌ల వెంట ఉన్న శవాలకు ఆ ఇద్దరికీ సంబంధం ఏంటి? ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయను ఫాలో అయిన ఇంకో ఏజెంట్ ఎవరు? అతన్ని ఎవరు పురమాయించారు? మూఢ నమ్మకాలకు, రైల్వే ట్రాక్ పక్కనున్న శవాలకు, వాటి వేలి ముద్రలకు, తమిళనాడు నుంచి వచ్చే గూడ్సు బండికి సంబంధం ఏంటి? తన పరిశోధనలో ఆత్రేయ కనుక్కున్న విషయాలేంటి? అవి అతని వ్యక్తిగత జీవితానికి ఎలా లింకయ్యాయి వంటివన్నీ సెకండాఫ్‌లో తెలిసే అంశాలు.
ప్లస్ పాయింట్లు:
ఏజెంట్ కోటు, నెత్తిమీద హ్యాటు, పక్కనో అసిస్టెంటు... ఈ సినిమాలో ఆత్రేయ స్వయంగా చెప్పినట్టు యాంబియన్స్ బాగానే సెట్ అయింది. నవీన్ పొలిశెట్టిలో ఈజ్ కనిపించింది. శ్రుతి శర్మను చూసినంత సేపు ఓ మీడియమ్ రేంజ్ హీరోలకు సరిపోయే మరో హీరోయిన్ దొరికినట్టు అనిపించింది. అన్నిటికీ మించి దర్శకుడు తీసుకున్న పాయింట్ ఆలోచింపజేసేలా ఉంది. కొత్త పాయింట్‌ను ఈ చిత్రంలో ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. కెమెరా వర్క్ కూడా ఎక్కడా హార్ష్‌గా లేదు. అలాగని రియాలిటీకి దూరంగా లేదు. లైటింగ్ అరేంజ్‌మెంట్ చాలా బావుంది. ఈ చిత్రంలో ఎక్కువ క్రెడిట్ మ్యూజిక్‌కి ఇవ్వాలి. రీరికార్డింగ్ యాప్ట్ గా ఉంది.
మైనస్ పాయింట్లు:
సినిమాలో మైనస్ పాయింట్లు కూడా బాగానే ఉన్నాయి. సినిమా స్టార్టింగ్ నుంచి వచ్చే సీన్లన్నీ ఆత్రేయలోని ఫన్నీ కోణాన్ని ఎలివేట్ చేయడానికి చేసినవే. ఈ క్రమంలో కొన్ని షాట్స్ కామెడీకి బదులు విసుగు తెప్పిస్తాయి. పైగా అసలు కథ ఎంతకీ మొదలుకాదు. అక్కడక్కడా బలవంతంగా నవ్వు వచ్చినట్టు అనిపించినా, వెంటనే సీన్ డ్రాప్ అవుతుంది. దీని వల్ల స్టోరీ మొత్తం సెకండాఫ్‌కి షిఫ్ట్ అయిపోయింది. తొలిసగంలో వేగ్‌గా ఫీలయిన ప్రేక్షకుడికి సెకండాఫ్ మరీ హెవీగా అనిపిస్తుంది. అలా కాకుండా సన్నివేశాలను ఫస్ట్ హాఫ్‌లో ట్రిమ్ చేసుకుని, ప్రీ ఇంటర్వెల్‌లోనే కథను కాస్త చెప్తే, సెకండాఫ్‌లో అర్జంట్ అర్జంట్‌గా కథను ఎండ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో.
సమీక్ష:
మనం దినచర్యలో భాగంగా చూసే ఎన్నో అంశాలను క్రోడీ కరించి, ఓ క్రమ పద్ధతిలో పేర్చి, వాటికి లాజిక్కులు లాగితే దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడతాయి. ఈ సినిమాలో దర్శకుడు గేదర్ చేసుకున్న అంశాలు కూడా అలాంటివే. మామూలుగా ఇలాంటి అంశాలకు ఓ ఫ్యామిలీ స్టోరీని జోడించి, తనవారికి జరిగిన అన్యాయాన్ని గురించి ఆరాతీసే యువకుడి పాత్రను హీరోగా చూపిస్తూ కమర్షియల్ చిత్రాలుంటాయి. దర్శకుడు ఇక్కడ హీరోనే ఏజెంట్‌ను చేసి అతని చేత డిటెక్ట్ చేయించారు. హీరో రూపం, చేష్టలు చూడ్డానికి కామెడీగా ఉన్నా, వృత్తిని తనకు తానే సరదాగా వర్ణించుకున్నా,డిటెక్ట్ చేసే అంశాలు మాత్రం చాలా సీరియస్ అయినవే. అప్పటిదాకా సరదాగా సాగిన డిటెక్టివ్ ఆత్రేయ జీవితం అనుకోకుండా ఓ ఊబిలోకి ఇరుక్కునిపోతే, దాన్నుంచి అతను ఎలా బయటపడ్డాడు? అతనికి సాయం చేసిందెవరు? ఆ ఊబిలోకి తోసిందెవరు? వంటి విషయాలను చాలా గమ్మత్తైన స్క్రీన్‌ప్లేతో తీశారు స్వరూప్. ఎక్కడా ప్రేక్షకుడి ఊహకు అందని రీతిలో ఈ స్క్రిప్ట్ ఉంటుంది. కానీ ఒకట్రెండు చోట్ల లాజిక్కులు అందవు. రిలీజియస్ క్రైమ్ అనే సబ్జెక్టును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన తీరు బావుంది. నవీన్ పొలిశెట్టి ఈజ్‌తో నటించాడు. మామూలుగా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఏజెన్సీ ఎఫ్‌బీఐ నెల్లూరు అనగానే సినిమా మొత్తం అదే యాసలో ఉంటుందనుకుంటాం. కానీ నెల్లూరు స్లాంగ్ సినిమాలో అక్కడక్కడే ఉంది. ఆ యాస ఉన్నంత సేపూ కామెడీ బాగానే పండింది. అటాప్సీలు, ఫింగర్ ప్రింట్స్, వాటి ద్వారా జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ అర్బన్‌కి అర్థమైనంతగా, రూరల్ జనాలకు అర్థమవుతాయా? రిలీజియస్ క్రైమ్స్ గురించి అవేర్‌నెస్ ఉన్న వారికి మాత్రం సినిమా తప్పక నచ్చుతుంది.
బాటమ్ లైన్: పాయింట్ మంచిదే... కానీ..!
Read Agent Sai Srinivasa Athreya Review in English
- Read in English