అప్పుడు వర్మ.. ఇప్పుడు సందీప్ రెడ్డి
- IndiaGlitz, [Thursday,April 26 2018]
'అర్జున్ రెడ్డి'.. తెలుగునాట ఈ సినిమా ఒక సంచలనం. విజయ్ దేవరకొండను యూత్ స్టార్‌గా మార్చిన చిత్రమిది. ఫస్ట్ ఫిల్మ్‌నే బోల్డ్ మూవీగా రూపొందించి.. అటు ప్రేక్షకులతో పాటు ఇటు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. పరిమిత బడ్జెట్‌తో సినిమాని రూపొందించి లాభాల బాట పట్టారు.
అందుకే ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా నిర్మించడానికి నిర్మాతలు, నటించడానికి హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని తమిళంలో 'వర్మ' పేరుతో దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. బాలీవుడ్లో కూడా ఈ మూవీని రీమేక్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి పాత్ర కోసం చాలా మంది నటుల పేర్లను పరిశీలించారట. ఆఖరికి షాహిద్ కపూర్‌ని ఎంపిక చేయగా.. షాహిద్ కూడా ఈ మూవీలో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం.
ఇక ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో భాగంగా హీరోయిన్‌తో పాటు మిగిలిన సాంకేతిక వర్గం, లొకేషన్లని ఫైనల్ చేసే పనిలో ఉందట చిత్ర బృందం. ఇదిలా ఉంటే.. తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి.. ఈ హిందీ వెర్షన్‌ను కూడా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే.. రామ్ గోపాల్ వర్మలా తెలుగులో తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని అందించి.. అదే సినిమా రీమేక్‌తో హిందీలో అడుగుపెడుతున్న డైరెక్టర్‌గా సందీప్ రెడ్డి వంగని కూడా చెప్పుకోవచ్చు.