గ్రేటర్ ఫలితాల తర్వాత టీఆర్ఎస్ కు మరో భారీ షాక్..
Send us your feedback to audioarticles@vaarta.com
గ్రేటర్ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు టీఆర్ఎస్ అనుసరించిన ఆపరేషన్ ఆకర్ష్ విధానాన్నే ప్రస్తుతం బీజేపీ కూడా అనుసరిస్తోంది. కరీంనగర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం తెలంగాణలో తనకంటూ బీజేపీ ఓ ముద్రను వేసుకుంది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అన్న రీతిలో మారిపోయింది.
ప్రజల్లో తమ పార్టీ పట్ల ఏర్పడిన అభిప్రాయాన్ని ఆసరాగా తీసుకుని బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీసింది. టీఆర్ఎస్ నేతలను బీజేపీలోకి చేర్చుకునేందుకు బండి సంజయ్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే బీజేపీలోకి చేరేందుకు పలువురు టీఆర్ఎస్ కార్పోరేటర్లు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో చర్చలు జరిపిన పలువురు స్థానిక టీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్పోరేటర్లు త్వరలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ముఖ్య నేతలు సైతం అలర్ట్ అయ్యారు.
మాజీ డిప్యూటీ మేయర్ రాజీనామా..
టీఆర్‌ఎస్ పార్టీకి కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ రాజీనామా చేశారు. తన
రాజీనామా పత్రాన్ని మంత్రి గంగుల కమలాకర్‌కు రమేష్ పంపించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను రమేష్ కలిశారు. త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కాగా.. రమేష్ భార్య సైతం మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్‌గా విజయం సాధించారు. అయితే రమేష్ బీజేపీలో చేరికతో అప్రమత్తం అయిన మంత్రి గంగుల కమలాకర్.. కీలక నేతలతో రాత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరూ ఆందోళన పడొద్దని.. కేసీఆర్, కేటీఆర్, తాను అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ ప్రభావం రాష్ట్రంపై పడనుందా?
నిన్న మొన్నటి వరకూ టీఆర్ఎస్ గీసిందే గీత. ప్రత్యామ్నాయం లేకపోవడంతో నేతలు సైతం తమ పార్టీ విధివిధానాలు నచ్చినా నచ్చకున్నా ఆ పార్టీలోనే కొనసాగారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో సీన్ మారింది. బీజేపీ రెండవ అతి పెద్ద పార్టీగా రాష్ట్రంలో అవతరించింది. ఈ క్రమంలో కరీంనగర్‌లో వలసలు మొదలయ్యాయి. ఇవే వలసలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. ఇదే జరిగితే.. రానున్న ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని తెలుస్తోంది. ఎన్నికల ముందు నుంచి పలువురు కీలక నేతలు, మాజీ కార్పొరేటర్లు, టికెట్ రాని అసంతృప్తులు, భారీ ఎత్తున కార్యకర్తలు అధికార పార్టీకి షాకిచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇకముందు కూడా ఈ వలసలు కొనసాగితే బీజేపీకి గడ్డుకాలం కొనసాగే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments