కరోనా రావడంలో తప్పు లేదు.. దిశా, అలియాతో గొంతు కలిపిన రష్మీ
- IndiaGlitz, [Saturday,July 03 2021]
సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలతో మనుషుల్లో మానవత్వం అంతరించి పోతోందా అనే అనుమానం కలగక మానదు. ఇటీవల కేరళలో 'బ్రూనో' అనే కుక్కని చిత్ర హింసలు చేసి చివరకు దానిని చంపేశారు. తర్వాత రాక్షస ఆనందం పొందారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో మనుషుల్లో హ్యుమానిటీ లేదా అంటూ పలువురు సెలెబ్రిటీలు మండిపడుతున్నారు.
తిరువనంతపురం బీచ్ లో ముగ్గురు వ్యక్తులు కుక్కని కర్రలతో చావబాది చంపేశారు. ఆపై చేపల గాలానికి వేలాడదీశారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న వారి హృదయం చలించక మానదు. దీనితో నిందితులని కఠినంగా శిక్షించాలి అంటూ సోషల్ మీడియాలో 'జస్టిస్ ఫర్ బ్రూనో' అంటూ ట్రెండ్ మొదలైంది.
పలువురు సెలెబ్రిటీలు ఈ సంఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జంతువులని ప్రేమించే బాలీవుడ్ తారలంతా బ్రూనోకి మద్దతుగా పోస్ట్ లు పెడుతున్నారు. 'వాళ్ళు అసహ్యకరమైన వ్యక్తులు. ఇలాంటి వారు తప్పించుకోవడానికి వీల్లేదు. కఠినంగా శిక్షించాలి' అని అలియా భట్ పోస్ట్ చేసింది.
అనుష్క శర్మ 'వాళ్ళు రాక్షసులు' అని కామెంట్ పెట్టింది. 'ఇలాంటి కిరాతకులని కనిపెట్టి కఠినంగా శిక్షించాలి. జంతువులని హింసించడం ఆపండి. ఈ భూమ్మీద బతికే హక్కు వాటికి కూడా ఉంది' అని దిశా పటాని పోస్ట్ చేసింది.
టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ కి జంతువులంటే విపరీతమైన ప్రేమ. రష్మీ గౌతమ్ తరచుగా జంతువులకు ఆహారం అందిస్తున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. ఈ సంఘటనపై రష్మీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. 'ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మనుషులపైనే సిగ్గుగా అనిపిస్తుంది. మనుషులు ఇలా ఉన్నప్పుడు కరోనా రావడంలో తప్పులేదు అనిపిస్తుంది. బ్రూనో ఏంపాపం చేసింది.. మీకు ఏం అన్యాయం చేసింది అంటూ రష్మీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
100 శాతం అక్షరాస్యత అని చెప్పుకునే రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరగడమా.. అక్కడ ఏనుగులని బాగా మేపుతారు..కానీ కుక్కలని మాత్రం ఇలా హిసించి చంపుతారా అంటూ రష్మీ మండిపడింది.
ఈ కిరాతక ఘటనలో కేరళ హైకోర్టు అభినందించదగ్గ నిర్ణయం తీసుకుంది. కేసుని సుమోటోగా తీసుకుని నేరగాళ్ల భరతం పట్టాలని డిసైడ్ అయింది. బ్రూనో మరణానికి కేరళ హైకోర్టు సంతాపం తెలిపింది కూడా.