చిరు తరువాత 20 ఏళ్లకి..

  • IndiaGlitz, [Friday,August 18 2017]

మెగాస్టార్ చిరంజీవిలో ఓ మంచి సింగ‌ర్ దాగున్నాడ‌న్న విష‌యం మాస్ట‌ర్ (1997) సినిమా ఆడియో రిలీజ్ అయ్యే వ‌ర‌కు తెలియ‌దు. త‌మ్ముడు అరె త‌మ్ముడు అంటూ ఆయ‌న స‌రదాగా పాడిన పాట అప్ప‌ట్లో పెద్ద హిట్‌. పాట‌తో పాటు సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఆ త‌రువాత రెండు మూడు సంద‌ర్భాల్లో గొంతు స‌వ‌రించుకున్నారు చిరు. ఇక మాస్ట‌ర్‌ త‌రువాత రెండేళ్ల‌కు అంటే 1999లో సీతారామ‌రాజు లోని సిగ‌రెట్ పాట కోసం చిరు త‌రం మ‌రో అగ్ర క‌థానాయ‌కుడు నాగార్జున తొలిసారిగా గొంతు స‌వ‌రించుకున్నారు. ఆ పాట‌, సినిమా కూడా హిట్టే.

అలాగే ఈ ఏడాది ఆరంభంలో గురు కోసం జింగిడి అంటూ చిరు త‌రంలోని మ‌రో అగ్ర క‌థానాయ‌కుడు వెంక‌టేష్ పాట పాడేసారు. సినిమా, పాట రెండూ హిట్టే. ఇప్పుడు ఆ త‌రంలో మిగిలిఉన్న అగ్ర క‌థానాయ‌కుడు బాల‌కృష్ణ కూడా పైసా వ‌సూల్ కోసం మామా ఏక్ పెగ్గు లావో అంటూ మొద‌టిసారిగా గొంతు స‌వ‌రించారు. పాటైతే బాగుంది. బాల‌య్య సిన్సియ‌ర్‌గా చేసిన ఎఫ‌ర్ట్ అభిమానుల‌నే కాదు అంద‌రినీ అల‌రించేలా ఉంది. ఇక పాట లాగే సినిమా కూడా హిట్ అవుతుందేమో చూడాలి.

మొత్తానికి చిరు పాడిన స‌రిగ్గా 20 ఏళ్ల‌కు ఆ త‌రం అగ్ర హీరోలంతా పాట‌ల విష‌యంలో ఓ రౌండ్ వేసేయ‌డం విశేషం. త‌న‌ తోటి అగ్ర క‌థానాయ‌కులైన చిరు, నాగ్‌, వెంకీలాగే బాల‌య్య కూడా తొలి పాట పాడిన సినిమాతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకోవాల‌ని ఆశిద్దాం.