Advani:నా సిద్ధాంతాలకు దక్కిన గౌరవం.. భారతరత్న పురస్కారంపై అద్వానీ..
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడంపై ఎల్‌కే అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో వినయపూర్వకంగా ఈ అవార్డుని స్వీకరిస్తున్నానని తెలిపారు. ఇది కేవలం తనకు మాత్రమే దక్కిన గౌరవం కాదని.. తాను నమ్ముకున్న సిద్ధాంతాలు, ఆశయాలకు దక్కిన గౌరవమని వెల్లడించారు. స్వలాభం కోసం ఏనాడూ ఆలోచించలేదని, నిస్వార్థంగా దేశం కోసమే అంకితభావంతో పని చేశానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయతో పాటు దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీని స్మరించుకుంటున్నట్లు వెల్లడించారు.
"ఎంతో వినయంగా ఈ భారతరత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్నాను. ఇది కేవలం నాకు మాత్రమే కాదు. నేను ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న సిద్ధాంతాలకు, విలువలకు దక్కిన పురస్కారంగా భావిస్తున్నాను. 14 ఏళ్లకే నేను RSSలో చేరాను. అప్పుడే నిర్ణయించుకున్నాను. నేనేం ఏ పని చేసినా అది దేశం కోసమే అని. ఈ జీవితం నా కోసం కాదు..దేశం కోసం అన్న సిద్ధాంతాన్నే బలంగా నమ్మాను. ఈ సందర్భంగా పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయీని మనసారా స్మరించుకుంటున్నాను. లక్షలాది పార్టీ కార్యకర్తలు, సంఘ్ సేవకులతో పాటు ప్రజలందరికీ ధన్యవాదాలు. కుటుంబ సభ్యులు నాకు అన్ని విధాలా అండగా ఉన్నారు. వాళ్లే నా బలం. ఈ పురస్కారం అందించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి నా కృతజ్ఞతలు" అంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ఎల్‌కే అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. 1927 జూన్ 8న అఖండ భారతదేశంలో ఉన్న సింధ్ ప్రాంతంలోని కరాచి పట్టణంలోని సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. పాక్‌లోని హైదరాబాద్‌లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్యను చదివారు. 1947లో ఆర్‌ఎస్‌ఎస్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. దేశ విభజన తర్వాత 1947 సెప్టెంబర్ 12న అద్వానీ కుటుంబం భారత్‌కు వలస వచ్చారు.
1960లో ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్ట్‌గా విధుల్లో చేరారు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1970లో తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇక 1973-76లో జన్‌సంఘ్ అధ్యక్షుడిగా అద్వానీ ఎంపికయ్యారు. అనంతరం 1977లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1977 మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖా మంత్రిగా విధులు నిర్వర్తించారు. 1980 రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1990లో సెప్టెంబర్ 25వ తేదీన గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌లో అయోధ్య రథయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర అద్వానీ జీవితంలోనే కాదు దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది. 10వేల కిలోమీట్ల మేర ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ బీహార్‌లో అప్పటి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం బ్రేకులు వేసింది. అయినా కానీ రథయాత్రకు విశేష ప్రజాదరణ లభించింది.
దేశంలో బీజేపీని రెండు స్థానాల నుంచి 120 స్థానాలకు పెంచడంలో ఆయన చేసిన కృషిని మరవలేం. 1986లో బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి 1991 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 1993 నుంచి 1998 వరకు రెండో సారి పార్టీ అధినేతగా పనిచేశారు. 2004 నుంచి 2005 వరకు మూడోసారి పార్టీని నడిపించారు. తన హయాంలో దేశ రాజకీయాల్లో బీజేపీని మెరుగైన స్థితికి తీసుకొచ్చారు. దీంతో 'ఉక్కుమనిషి'గా పేరుగాంచారు. అయోధ్యలో రామమందిరం కోసం పోరాడిన అద్వానీ కల ఈ ఏడాది నెరవేరింది. అలాగే దేశంలోనే అత్యున్నతమైన భారతరత్న పురస్కారం లభించింది. దీంతో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments