ఒంటి స్తంభంపై ఆరు వరసల అద్భుతం.. దుర్గగుడి ఫ్లై ఓవర్..

  • IndiaGlitz, [Monday,August 31 2020]

ఒంటి స్తంభంపై ఆరు వరసల అద్భుతం.. దేశంలోనే అత్యద్భుత ఫ్లై ఓవర్‌.. ఢిల్లీ, ముంబయిల్లో ఉన్న ఫ్లై ఓవర్ల తరువాత వరుసలో ఇది మూడవది అయినప్పటికీ వాటికంటే అడ్వాన్స్ టెక్నాలజీ కలిగినది.. అదే... కనకదుర్గ ఫ్లై ఓవర్‌. విజయవాడ వాసుల చిరకాల కల. ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. సెప్టెంబరు 4వ తేదీన ఈ అద్భుతమై ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. దేశంలోనే అత్యద్భుతమైన ఫ్లై ఓవర్ కావడంతో ప్రాజెక్టుకు అనుమతులిచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ప్రారంభోత్సవం రోజు దీని సొగసును దేశమంతటికీ చూపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా డ్రోన్ బృందాన్ని ఆదివారం విజయవాడకు పంపించింది. ఈ బృందం మధ్యాహ్నం వరకు ఫ్లైఓవర్‌ అందాలను చిత్రీకరించింది. దీని కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక డ్రోన్ బృందం వచ్చి ఫ్లై ఓవర్ అందాలను డే అండ్ నైట్ ఎఫెక్ట్‌లో చిత్రీకరణ జరుపుతోంది. ఒంటి స్తంభంపై స్పైన్‌ అండ్‌ వింగ్స్‌ టెక్నాలజీతో ఆరు వరసలతో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించడంతో ప్రాధాన్యమేర్పడింది.

ఈ టెక్నాలజీలో వై పిల్లర్స్‌ ఉండటంతో పాటు వీటి నిడివి ఎక్కువగా ఉండటం కూడా మరో స్పెషాలిటి. అందుకే దీనిని దేశం మొత్తానికి చూపించాలని కేంద్రం భావిస్తోంది. సెప్టెంబరు 4వ తేదీన ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో ఫ్లైఓవర్‌కు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా నిర్వహించనున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించనున్నారు.