‘వీరమల్లు’ షూటింగ్‌లో ఆదిత్య మీనన్‌కు గాయం.. చెన్నైకి తరలింపు

  • IndiaGlitz, [Wednesday,March 31 2021]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న భారీ పిరియాడికల్, పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 14వ శతాబ్దానికి చెందిన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. పవన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఔరంగజేబు కాలం నాటి సెట్స్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పిరియాడిక్ మూవీలో పవన్ నటించడం ఇదే తొలిసారి అయితే.. పవన్ ఒక వజ్రాల దొంగగా నటించడం మరో ఆసక్తికర విషయం.

ఈ సినిమాలో పవన్‌కు హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని తెలుస్తోంది. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంవత్సరం అంటే 2022 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఒక అపశృతి తలెత్తింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ నటిస్తున్నారు. కాగా.. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షూటింగ్‌లో ఆదిత్య మీనన్ షూటింగ్‌లో గాయాల పాలయ్యారు.

ఈ చిత్రంలో వీరమల్లులో గుర్రపు స్వారీ చేస్తున్న ఓ కీలక సన్నివేశాన్ని తెరకెక్కిస్తుండగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్నట్టుగా తెలుస్తోంది. గాయం చాలా పెద్దదే అయినట్టు తెలుస్తోంది. వెంటనే చిత్ర యూనిట్ ఆయనను యశోదా హాస్పిటల్‌కి తరలించింది. అక్కడ రెండు రోజులు చికిత్స తీసుకున్న అనంతరం చెన్నై‌లోని ఓ ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే ఆదిత్య మీనన్ ఆరోగ్యం బాగానే ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. ఆదిత్య మీనన్ గతంలో కూడా పవన్‌తో కలిసి ‘అజ్ఞాతవాసి’లో నటించారు.