Aditya L1:మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. రేపు ఆదిత్య ఎల్ 1 లాంచింగ్, మొదలైన కౌంటింగ్

  • IndiaGlitz, [Friday,September 01 2023]

చంద్రయాన్ 3 ప్రయోగంతో మంచి ఊపు మీదుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో). అగ్రరాజ్యాలే చేతులెత్తేసిన జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండర్‌ను దించి శెభాష్ అనిపించింది. హాలీవుడ్‌ సినిమాలకు అయ్యే ఖర్చు కంటే చాలా తక్కువ వ్యయంతో చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పటికే చంద్రయాన్ 1 ప్రయోగంతో చందమామపై నీటి గుట్టును విప్పిన ఇస్రో.. తాజా మిషన్‌లో అక్కడ ఆక్సిజన్, సల్పర్ , హీలియం, మాంగనీస్, అల్యూమినియం వంటి మూలకాలు వున్నట్లుగా నిర్ధారించింది.

రేపు ఆదిత్య ఎల్ 1 ప్రయోగం:

ఇదిలావుండగా.. చంద్రయాన్ 3 సక్సెస్‌తో ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని చేపట్టింది. శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ సమయంలో ఇస్రో డైరెక్టర్లు అమిత్ కుమార్, డాక్టర్ మోహన్‌లు ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహ నమూనాతో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. నమూనాను స్వామి వారి పాదాల వద్ద వుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రయోగం విజయవంతం కావాలని ప్రార్ధించారు. అనంతరం అర్చకులు రంగనాయకులు మండలంలో వీరికి వేదాశీర్వచనం అందజేశారు.

లాంగ్రేజ్ 1 పాయింట్ వద్దకు శాటిలైట్ :

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం 11.50 నిమిషాలకు ఆదిత్య ఎల్ 1ను లాంచ్ చేయనున్నారు. ఇందుకోసం ఇస్రో కౌంట్ టౌన్ ప్రారంభించింది. సూర్యుడిపై భారత్ ప్రయోగిస్తున్న తొలి రాకెట్ కావడంతో మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఆదిత్య ఎల్ 1ను భూమికి సూర్యుడికి మధ్యన వున్న లాంగ్రేజ్ 1 పాయింట్ వద్ద ప్రవేశపెట్టి.. అక్కడి నుంచి సూర్యుడిపై అధ్యయనం చేయనున్నారు. ఇక్కడి నుంచి చంద్ర, సూర్య గ్రహణాల సమయంలోనూ నిరంతరాయంగా సూర్యుడిపై పరిశోధనలు చేయవచ్చు.