నవంబర్ 6న రానున్న 'ఆదిత్య' (క్రియేటివ్ జీనియస్)
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య క్రియేటివ్ జీనియస్ బాలల చిత్రాన్ని భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 6న విడుదల చేయనున్నట్టు భీమగాని సుధాకర్ గౌడ్ చెప్పారు.
ఆయన మాట్లాడుతూ ``ఈ సినిమా విడుదలకు ముందే జాతీయ అవార్డు పోటీలో ప్రదర్శితమై ప్రముఖుల ప్రశంసలు పొందింది. ఈ సినిమా ప్రివ్యూ చూసిన ఐఏయస్ ఆఫీసర్స్ మంచి కథాంశంతో సినిమాను రూపొందించారని ప్రశంసించడం గమనార్హం. బాలల చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితమైన జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రముఖులతో ప్రశంసలు పొంది, జాతీయ, ప్రాంతీయ బాలల అభ్యున్నత సంస్థల మన్ననలు పొందింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలచే వినోదపు పన్ను మినహాయింపు పొందింది. ఆంధ్ర ప్రభుత్వం తొలి సారి పన్ను రాయితీ మాకు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సాంకేతిక మంత్రిత్వ శాఖ వారు పాఠశాల స్థాయి విద్యార్థుల పరిశోధన విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఇన్స్పయిర్ 2014 సం.లో బాలల పరిశోధనలో సహజంగా చిత్రీకరించి అబ్దుల్ కలాం స్ఫూర్తితో బాలులు శాస్త్రజ్ఞులుగా ఎదగాలని, దేశాభివృద్ధికి వివిధ రంగాల పరిశోధనలో కూడా రాణించాలని అబ్దుల్ కలాం ఆశయ సాధన బాటలో బాలబాలికలు కృషి చేయాలని, నేటి బాలబాలికలే రేపటి శాస్త్రజ్ఞులుగా పేరు ప్రఖ్యాతులు పొందాలనే ప్రధాన అంశంతో రూపొందించాం. ఈ నెల 6న విడుదల చేస్తున్నాం`` అని అన్నారు.
టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ``సుధామూర్తి ఆ మధ్య ఒకమ్మాయిని గుర్తించి చదివిస్తే ఇవాళ ఆ అమ్మాయి ఎంతో గొప్ప స్థానానికి ఎదిగింది. ఒకప్పుడు బాలల రాయాయణం సినిమాకు రూ.20లక్షల సబ్సీడీని ఇచ్చింది. ఇప్పుడు సబ్సీడీలను గురించి చెప్పేవారు కూడా లేరు. ఆదిత్య మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా. ఇలాంటి సినిమాలను అందరూ ప్రోత్సహించాలి. ఈ సినిమాకు సరైన ప్రోత్సాహం లేకపోతే ఈ నిర్మాత బూతు సినిమాలవైపు వెళ్ళే ప్రమాదం ఉంది`` అని చెప్పారు.
ప్రేమ్ బాబు మాట్లాడుతూ ``ఈ సినిమాలో టైటిల్ రోల్ చేసింది నేనే. ఈ నెల 14 నుంచి హైదరాబాద్లో జరిగే బాలల చలనచిత్రోత్సవాల్లో ఈ సినిమా ప్రదర్శితమవుతుంది. అందరిలోనూ స్ఫూర్తిని నింపే సినిమా ఇది`` అని అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ``అనాథ అనేదే పెద్ద సబ్జెక్ట్. వారికి అమ్మానాన్నలుండరు. కులం, మతంతో సంబంధం ఉండదు. ఇటీవల గుంటూరులో ఓ ఆర్గనైజేషన్ చూశాను. పది మంది పిల్లలకు ఓ అమ్మ ఉంటుంది. వాళ్ళని చదివిస్తుంటుంది. అది చూసిన తర్వాత నాలో ఆలోచన మొదలైంది. అసలు స్ట్రీట్ చిల్డ్రన్ అనే వారు తెలుగు రాష్ట్రాల్లో లేకుండా చేయాలనేది ఆ ఆలోచన. అందుకోసం ఓ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశాం. దాని గురించి ఇరు తెలుగు రాష్ట్ర ముఖ్య మంత్రులతో త్వరలోనే మాట్లాడుతాం. ఆదిత్య లాంటి సినిమాలకు థియేటర్లు కావాలి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మోడల్ థియేటర్ మొదలైంది. మరి వాటిని చిన్న సినిమాలకే పరిమితం చేస్తారా? పెద్ద వాటికి కూడా ఇస్తారా? అనేది చూడాలి.
ఒకవేళ చిన్న సినిమాలకే పరిమితం చేసి, ఆ సినిమాలు ఆడకపోతే క్యూబ్ డబ్బులు కూడా రాక వాటిని మేనేజ్ చేసేవారు అన్యాయమైపోతారు. అందుకే రెండు రకాల సినిమాలకూ సమన్వయం చేస్తూ కేటాయించాలి. నేను ఇంతకు ముందు బాలల సినిమాలను తీసే మగాళ్లేరి? అని ప్రశ్నించాను. ఇప్పుడు ఈ రూపకర్త ముందుకొచ్చారు. ఇప్పుడు చూసే మగాళ్ళున్నారా? అన్నదే నా ప్రశ్న. బూతులు తిట్టుకుంటేనే చూస్తాం అనే స్థాయి నుంచి ప్రేక్షకుడు కూడా ఎదగాలి. నీతులు చెప్పడమంటే ఫేస్బుక్కుల్లోనూ, ట్విట్టర్లోనూ నాలుగు మాటలను చెప్పడం కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి`` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సుభాష్, కృష్ణమోహన్, చెర్రీ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout