ఈ మధ్య తమిళనాట హాట్ టాపిక్‌గా మారిన చిత్రం `మెర్సల్`. తమిళంలో మాస్ ఇమేజ్ ఉన్న హీరో విజయ్ సినిమా కావడంతో పాటు సినిమా కథాంశం. కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిన జీఎస్‌టీపై చెప్పిన డైలాగులు వివాదస్పదం కావడంతో సినిమాకు తమిళంలో కావాల్సినంత అటెన్షన్ ఫోకస్ అయ్యింది. నిజానికి ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేద్దామనుకున్నారు. కానీ సెన్సార్ సమస్య కారణంగా..తెలుగు వెర్షన్ విడుదల ఆలస్యమైంది. తమిళ వెర్షన్ మెర్సల్‌పై వచ్చిన వివాదాలు సినిమాకు కావాల్సినంత క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఈ క్రేజ్‌తో తెలుగు ప్రేక్షకుల్లో `అదిరింది` సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తి ఎంత వరకు కంటిన్యూ అయ్యిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం....
కథ:
డా.భార్గవ్(విజయ్)ని హత్య కేసుల్లో పోలీస్ ఆఫీసర్ (సత్యరాజ్) అరెస్ట్ చేస్తాడు. డా.భార్గవ్ ఐదు రూపాయలతో వైద్యం అందించే ఓ డాక్టర్. తనకు సమాజంలో మంచి పేరుంటుంది. ఓ సెమినార్ కోసం తను పారిస్ కూడా వెళతాడు. సెమినార్‌కు వచ్చిన డాక్టర్ అనుపల్లవి(కాజల్)తో భార్గవ్ ప్రేమలో పడతాడు. భార్గవ్ డాక్టరే కాదు, మంచి మెజిషియన్ కూడా. ఓ మేజిషియన్ గేమ్ షోలో అనుపల్లవికి సీనియర్ డాక్టర్ అయిన అర్జున్ జకారియా(హరీష్ పేరడీ)ని చంపేసి ఇండియాకు వచ్చేస్తాడు. కేసుని టేకప్ చేసిన పోలీసులు భార్గవ్ కోసం ఇండియాకు వస్తాడు. అదే సమయంలో భార్గవ్ టీవీ యాంకర్ తారా(సమంత)తో ప్రేమలో ఉంటాడు. పోలీసులు భార్గవ్‌ను అరెస్ట్ చేసిన తర్వాత వారికి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అవేంటి? అసలు విజయ్ భార్గవ ఎవరు? డేనియల్ ఎవరు? డేనియల్, విజయభార్గవ, భార్గవకు ఉన్నలింకేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
- స్క్రీన్ ప్లే
- నటీనటుల పనితీరు
- బ్యాగ్రౌండ్ స్కోర్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- కథలో కొత్తదనం లేకపోవడం
- లెంగ్త్ ఎక్కువగా ఉండటం
- హీరోయిన్స్ పాత్రలకు స్కోప్ లేదు
- తమిళ నేటివిటీ ఎక్కువగా కనపడటం
విశ్లేషణ:
హీరో విజయ్ సినిమాలో మూడు పాత్రల్లో చక్కటి వేరియేషన్ చూపించాడు. ముఖ్యంగా విజయభార్గవ్ పాత్రలో మీసకట్టు నటన మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. భార్య చనిపోయినప్పుడు విజయ్ ఏడ్చే సన్నివేశం టచింగ్‌గా అనిపిస్తుంది. అలాగే మేజిషియన్ పాత్రలో విజయ్ నటన కూడా బావుంది. అలాగే డాక్టర్ పాత్రలో విజయ్ ఇచ్చే ఇంటర్వ్యూ సన్నివేశం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక సమంత..విజయ్‌ని తమ్ముడు అని పిలవడం..విజయ్ సమంతను అక్క పిలిచే సీన్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. (ఈ సీన్ రాజా రాణి సీన్‌ను తలపిస్తుంది). రాజేంద్రన్ కనపడే సీన్ కూడా బాగా పండింది. కథలో కొత్తదనం కనపడదు. రెగ్యులర్ కమర్షియల్ పార్మేట్ స్టోరీ. అయితే స్క్రీన్‌ప్లే సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. కథా గమనం ప్రేక్షకుడిని సినిమాలోకి చక్కగా తీసుకెళుతుంది. దర్శకుడు అట్లీ పూర్తి కమర్షియల్ హంగులు, మాస్ ఎలిమెంట్స్‌తో సినిమాను తెరకెక్కించిన తీరు బావుంది. జిఎస్‌టిపై హీరో చెప్పే డైలాగ్స్‌కి తమిళంలో మంచి స్పందన వచ్చినా, ఇక్కడ మ్యూట్‌లో పెట్టడం జరిగింది. అంతా రివీల్ అయ్యాక మ్యూట్ చేయడమెందుకో చూడాలి. ఓ అమ్మాయిని హాస్పిటల్‌కు తీసుకెళ్లే సీన్ సహా సినిమాలో హార్ట్ టచింగ్ సన్నివేశాలు ఆకట్టుంటాయి. ఇది తెలుగులో ఠాగూర్ సన్నివేశాన్ని తలపిస్తుంది. ఇక పాటల పరంగా చూస్తే..నీ వల్లే సాంగ్ పిక్చరైజేషన్ బావుంది. ఎ.ఆర్.రెహామాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను ఎలివేట్ చేస్తుంది. విష్ణు సినిమాటోగ్రఫీ సినిమా రేంజ్‌ను పెంచింది. ఓ మంచి మెసేజ్‌ను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చెప్పడం వల్ల సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే ..కథలో కొత్తదనం లేకపోవడంతో పాటు ఇలాంటి కథలను తెలుగు ప్రేక్షకులు ఇది వరకే చూసేశారు. సెకండాఫ్ డ్యూరేషన్ ఎక్కువగా ఉంది. అక్కడక్కడా తమిళ నెటివిటీ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మొత్తంగా చూస్తే సినిమా ఫుల్ ప్యాక్‌డ్ కమర్షియల్ మూవీ.
బోటమ్ లైన్: మెసేజ్ 'అదిరింది'
Adirindhi Movie Review in English
Comments