Adipurush:ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు.. ఆదిపురుష్ టీమ్ కీలక నిర్ణయం, వాటిని మార్చేందుకు ఓకే
- IndiaGlitz, [Sunday,June 18 2023]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , కృతి సనన్ హీరోయిన్గా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రామాయణానికి ఆధునిక హంగులద్ది , గ్రాఫిక్, విజువల్ ఎఫెక్ట్స్ మేళవించడంతో చిన్నారులు ఆదిపురుష్‌ను బాగా ఇష్టపడుతున్నారు. అయితే ఆదిపురుష్‌లోని కొన్ని డైలాగ్స్‌పై కొందరు పెదవి విరుస్తున్నారు. ఇవి కొందరి మనోభావాలు దెబ్బతీశాయంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆదిపురుష్ మాటల రచయిత మనోజ్ శుక్లా స్పందించారు. ఈ విషయంపై ఆల్రెడీ వివరణ ఇచ్చినా.. ట్రోలింగ్ ఆగకపోవడంతో మనోజో ఈదివారం ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. కొన్ని డైలాగ్స్ మారుస్తున్నట్లు తెలిపారు.
4000 లైన్ల డైలాగ్స్‌లో .. 5 లైన్లు బాధించాయి :
ఆదిపురుష్ కోసం తాను 4000 లైన్లకు పైగా డైలాగులు రాశానని.. వాటిని 5 లైన్లు కొన్ని వర్గాలను బాధించాయని మనోజ్ చెప్పారు. సీతారాములను కీర్తిస్తూ ఎన్నో డైలాగ్స్ వున్నాయని.. వాటి కంటే కేవలం 5 లైన్లే ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయన్నారు. మూడు గంటల సినిమాలో 3 నిమిషాలు మీరు ఊహించిన దానికి వ్యతిరేకంగా రాశానని తనపై సనాతన ద్రోహి అనే ముద్ర వేశారని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని జై శ్రీరాం, శివోహం, రామ్ సీతారామ్ వంటి గొప్ప పాటలు తానే రాశానని ఆయన పేర్కొన్నారు. సనాతన సేవ కోసం ఈ సినిమా తీశామని.. ఆదిపురుష్‌ను ఎంతో ఆదరిస్తున్నారని, భవిష్యత్తులోనూ మీ ప్రేమాభినామాలు ఇలానే వుంటాయని ఆశిస్తున్నట్లు మనోజ్ పేర్కొన్నారు. ప్రేక్షకుల మనోభావాలే తమకు ముఖ్యమని.. అందుకే మీకు బాధ కలిగించిన సంభాషణలను మారుస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు.
మార్పు, చేర్పులపై ఆదిపురుష్ యూనిట్ స్పందన :
అటు చిత్ర యూనిట్ సైతం ఆదిపురుష్‌లోని కొన్ని డైలాగ్స్ మారుస్తున్నట్లు ప్రకటించింది. సినిమాల ఇప్పుడున్న ఫీల్‌ను కొనసాగిస్తూనే మార్చిన డైలాగ్స్ వుంటాయని తెలిపింది. కొద్దిరోజుల్లోనే మార్పులతో ఆదిపురుష్‌ను చూడొచ్చని చిత్ర యూనిట్ వెల్లడించింది. రికార్డు విజయం దిశగా వెళ్తున్న ఆదిపురుష్‌లోని డైలాగ్స్‌ను మార్చడం మూవీ యూనిట్‌కు ఒక సాహసమే అయినా ప్రేక్షకుల మనోభావాలు , సెంటిమెంట్స్‌ను గౌరవించడమే ముఖ్యమని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.