నటుడిగానే కాదు డైరెక్టర్‌గా రవిబాబు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అల్లరి, నచ్చావులే, నువ్విలా వంటి ప్రేమకథా చిత్రాలు.. అనసూయ వంటి సస్పెన్స్ థ్రిల్లర్.. అవును, అవును 2 వంటి హారర్ చిత్రాలను తెరకెక్కించారు రవిబాబు. అయితే తొలిసారి లైవ్ యానిమేషన్ టెక్రాలజీతో చేసిన చిత్రం `అదుగో`. ఓ పందిపిల్లను ప్రధాన పాత్రధారిగా చేసుకుని సినిమా తెరకెక్కించడం విశేషం. ఈ సినిమా కోసం రవిబాబు రెండున్నరేళ్లు కష్టపడ్డాడు. మరి రవిబాబు చేసిన ఈ ఎక్స్‌పెరిమెంటల్ సినిమా ఎంత మేర ప్రేక్షకులను ఆకట్టకుందో తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం..
కథ:
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గర ప్రాంతాల్లో భూములకు మంచి గిరాకీ పెరుగుతుంది. ఆ సమయంలో బెజవాడ దుర్గ అక్కడ చిన్న చిన్న రైతులను భయపెట్టి వెయ్యి ఎకరాలు లాక్కుంటాడు. అయితే అతని అనుచరుడు ఆ వివరాలను ఓ చిప్‌లో దాచిపెట్టి దుర్గ ప్రత్యర్థి సిక్స్ ప్యాక్ శివ(రవిబాబు)కి ఇవ్వాలనుకుంటాడు. మరో వైపు గుట్కా వ్యాపారం చేసే గంగరాజు, షార్జాకు అమ్మాయిలను సప్లయ్ చేసే శంకర్‌కు ఆక్రమంగా వ్యాపారాలు చేయడమే కాదు.. జంతువుల మధ్య పోటీలు పెట్టి వాటి ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తుంటారు. చివరకు ఇద్దరు పందిపిల్లలతో పోటీ పడాలనే నియమం వస్తుంది. అయితే పొట్టపై మూడు చుక్కలున్న పందిపిల్లనే పోటీలో గెలుస్తుందని జోతిష్యుడు చెప్పడంతో ఇద్దరి అనుచరులు పందిపిల్ల కోసం వెతుకుతుంటారు. చంటి అనే పిల్లాడి దగ్గర మచ్చలున్న పందిపిల్లను చూసి బలవంతంగా లాక్కుంటారు. చంటి తన పంది పిల్ల కోసం ఆ రౌడీలను వెంబడిస్తాడు. ఈ క్రమంలో శివకు చేతికి వెళ్లాల్సిన చిప్‌ను పంది పిల్ల మింగేస్తుంది. మరో వైపు అభి(అభిషేక్ వర్మ), రాజి(నభా) మధ్య అనుకోకుండా గొడవ జరిగి విడిపోతారు. రాజిని మంచి చేసుకోవడానికి అభి ఓ గిఫ్ట్ పంపితే ఆ గిఫ్ట్ ప్లేస్‌లో పందిపిల్ల ఉంటుంది. అసలు పందిపిల్లకు అక్కడికి ఎలా వస్తుంది? చివరకు శివ, దుర్గ ఆశలు నేరవేరుతాయా? గంగరాజు, శంకర్ ఏమవుతారు? అభి, రాజి కలుస్తారా? చంటికి తన పందిపిల్ల దొరుకుతుందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
స్వామిరారా, శమంతక మణి.. ఇలా చాలా చిత్రాల్లో ఓ మెయిన్ ఎలిమెంట్ చుట్టూనే నాలుగైదు గ్యాంగ్‌లు వెంటపడటం.. చివరకు దానికే అనుకోకుండా లింక్ ఉన్న హీరో హీరోయిన్ సక్సెస్ సాధించడం చూశాం. ఇప్పుడు అలాంటి పాయింట్ ఆధారంగానే రవిబాబు అదుగో కథను రాసుకున్నాడు. అయితే ఇందులో ఓ వస్తువు అని కాకుండా ఓ చిప్.. దాన్ని మింగేసిన పందిపిల్ల అనే కాన్సెప్ట్‌లకు నాలుగు గ్యాంగ్‌లు.. హీరో, హీరోయిన్, ఓ పిల్లాడిని లింక్ చేసి కథను రన్ చేశాడు. పందిపిల్లను నటింప చేయలేం కాబట్టి రవిబాబు చాలా ప్రయత్నాలు చేసి చివరకు లైవ్ యానిమేషన్ మెథడ్‌లో సినిమాను తెరకెక్కించాడు. ఈ పద్ధతిలో సినిమా తీయడానికి చాలానే కష్టపడ్డాడు.పందిపిల్ల చేసే విన్యాసాలు బానే ఉన్నాయి. కానీ.. కథంతా కంగాలీగా అనిపిస్తుంది. అలాగే తనదైన అడల్ట్ కామెడీని కొన్ని సన్నివేశాల్లో జొప్పించే ప్రయత్నం చేశాడు రవిబాబు. గంగరాజు, శంకర్ పాత్రల తీరు తెన్నులు సిల్లీగా అనిపిస్తాయి. ఎమోషనల్‌గా కనెక్టింగ్ పాయింట్ కనపడదు. కథ పరంగా సినిమాలో కొత్తదనమేమీ లేదు. నటీనటుల విషయానికి వస్తే రవిబాబు, అభిషేక్, నభా ఇలా అందరూ వారి వారి పాత్రల మేర నటించారు. ప్రశాంత్ విహారి ట్యూన్స్ బాగాలేవు. నేపథ్య సంగీతం బాలేదు. సుధాకర్ రెడ్డి కెమెరా వర్క్ బావుంది. సినిమా సాగదీతగా అనిపించేలా ఉంటుంది. మరి గ్యాంగులు, వారి మధ్య గొడవలతో ఇదేంట్రా లాగుతున్నాడు కథను అనిపించేలా ఉంది.
బోటమ్ లైన్: అదుగో .. ఓ వృథా ప్రయత్నం
Comments