Adhire Abhi:జబర్దస్త్‌కు దిష్టి తగిలింది.. ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండు : అదిరే అభి ఎమోషనల్ పోస్ట్

  • IndiaGlitz, [Monday,January 30 2023]

జబర్దస్త్.. ఈ షో గురించి తెలుగు నాట తెలియని వారుండరు. ప్రతి గురు, శుక్రవారాల్లో ఇంటిల్లిపాదిని నవ్వించే ఈ ప్రోగ్రామ్ కోసం తెలుగువారు ఆతృతగా ఎదురుచూస్తారు. పదేళ్లు గడుస్తున్నా జబర్దస్త్‌కు ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఎంతోమంది ప్రతిభావంతులకు అవకాశం కల్పించి.. వారు జీవితంలో మరింత స్థిరపడేందుకు అవకాశం కల్పించింది ఈ షో. తిరుగులేని టీఆర్పీతో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సత్తా చాటింది జబర్దస్త్. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు జబర్దస్త్‌ మునుపటి స్థాయిలో మెరుపులు మెరిపించలేకపోతోంది. పాత వారు సినిమాలు, ఇతర టీవీ ఛానెల్స్‌లో అవకాశాలు రావడంతో జబర్దస్త్‌ను వీడారు. కొత్త వారు వస్తున్నా గతంలో మాదిరిగా రక్తి కట్టించలేకపోతున్నారు.

మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం:

ఈ నేపథ్యంలో జబర్దస్త్ సీనియర్ కమెడియన్ అదిరే అభి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరినీ నవ్వించే షోకు దిష్టి తగిలిందని.. తమను తామే తిట్టుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. మళ్లీ ప్రేక్షకులను నవ్వించే పాత రోజులు వస్తే బాగుందని చెబుతూ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు.

అన్నంపెట్టే అమ్మ మల్లెమాల:

జబ్బలు చరుచుకుంటూ నవ్వే జడ్జీలు.. టైమింగ్ తో పంచులేసే టీం లీడర్లు.. కామెడీని అవపోసన పట్టిన కంటెస్టెంట్లు.. అందరికీ అన్నంపెట్టే అమ్మలాంటి మల్లెమాల ఇవి కదా మా కుటుంబం. కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు.. సమయం ఆగేది కాదు. కుశల ప్రశ్నలు, ఆపన్న హస్తాలు, జోకుల మీద జోకులు, స్టూడియో దాటే నవ్వులు. బాబు గారి హుందాతనం, రోజా గారి చిలిపితనం, అనసూయ రష్మీల అందం, స్కిట్ల మాయాజాలం. స్టేజ్ ఎక్కేవరకూ రిహార్సల్లు, అయినా అప్పుడప్పుడు స్పాంటేనిటీలు. పోస్టర్ ఆఫ్ ది డే కోసం ఫోజులు, పాతికవేల చెక్కుతో ఫోటోలు, జడ్జీలు వేసే కౌంటర్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లు, సలహాలు, సూచనలు. ఎవరి దిష్టి తగిలిందో.. ఏకతాటి మీద నడిచిన మాకు ఎవరి దారి వారిది అయ్యింది. ఎవడైనా పల్లెత్తి మాటంటే పడని మేము .. మమ్మల్ని మేమే మాటలు అనుకుంటున్నాం. సమయం వెనక్కెళ్లితే బాగుండు. ఆరోజులు తిరిగి వస్తే బాగుండు. అందర్నీ నవ్వించే జబర్దస్త్ కు మళ్లీ నవ్వే రోజులు వస్తే బాగుండు . ” అంటూ అదిరే అభి తన ఆవేదన పంచుకున్నాడు.