'ఎఫ్‌సీయూకే' (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్) చిత్రంలో 'మనసు కథ' పాటను విడుదల చేసిన అదనపు డీసీపీ మద్దిపాటి శ్రీనివాస్ రావు
Send us your feedback to audioarticles@vaarta.com
జగపతిబాబు ప్రధాన పాత్ర పోషించిన 'ఎఫ్‌సీయూకే' (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్) చిత్రంలోని మూడో పాట "మనసు కథ"ను ఇదివరకు అనౌన్స్ చేసినట్లు గానే అదనపు డీసీపీ మద్దిపాటి శ్రీనివాస్ రావు చేతుల మీదుగా చిత్ర బృందం విడుదల చేయించింది. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి యువజంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో బేబి సహశ్రిత మరో కీలక పాత్రధారి.
జగపతిబాబు మాట్లాడుతూ, పోలీసువారంటే తనకు చాలా గౌరవభావమనీ, కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న కాలంలో వారు అందించిన అవిశ్రాంత సేవలు చూశాక, ఆ గౌరవభావం రెట్టింపయ్యిందనీ అన్నారు. సాధారణంగా పోలీస్ అధికారులంటే నిర్విరామంగా ఏడాది పొడవునా ప్రతి రోజూ 24 గంటల సేపు సీరియస్‌గా తమ విధులను నిర్వర్తిస్తుంటారని మనకు తెలుసు. కానీ వారిలోనూ సరదా కోణం ఉంటుందనే విషయం అదనపు డీసీపీ మద్దిపాటి శ్రీనివాస్ రావు గారు "మనసు కథ" పాటను లాంచ్ చేసి, దానిని ప్రొఫెషనల్ సింగర్ తరహాలో రాగయుక్తంగా పాడటంతో మరోసారి తెలిసింది. ఆయన తన రంగానికి సంబంధించిన అనుభవాలను గుర్తుచేసుకొని, "మనసు కథ" పాటతో తాను ఎలా కనెక్ట్ అయ్యారో వివరించారు.
బిజీ షెడ్యూల్‌లోనూ తమ సమయాన్ని కేటాయించి, ఈ పాట విడుదల చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులకు హీరో రామ్ కార్తీక్ ధన్యవాదాలు తెలిపారు. నిజ జీవిత హీరోలకు తమ వంతు కృతజ్ఞతలు తెలియజేయడానికి శ్రీ రంజిత్ మూవీస్ సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ విద్యాసాగర్ రాజు, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, లైన్ ప్రొడ్యూసర్ వాసు పరిమి పాల్గొన్నారు. రీల్ హీరోల స్థానంలో రియల్ హీరోలతో 'ఎఫ్‌సీయూకే' పాటలను విడుదల చేయించాలనే నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ సంకల్పానికి అన్ని వైపుల నుంచీ అనూహ్యమైన స్పందన, ప్రశంసలు లభిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ అధికారులు, కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సంక్షోభ కాలంలో తమ డిపార్ట్‌మెంట్ సిబ్బంది చేసిన సేవలను మరోసారి గుర్తుచేసిన చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు. మునుపటి రెండు పాటలను వైద్య-ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు విడుదల చేశారు. అవి సంగీత ప్రియులను అమితంగా అలరిస్తున్నాయి.
తారాగణం: జగపతిబాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, బేబి సహశ్రిత, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout