Vishwak Sen- Arjun Sarja: ఇష్టంలేని కాపురం చేయలేం ..నా తప్పుంటే క్షమించండి సర్: విశ్వక్‌సేన్
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటుడు అర్జున్ సర్జా, యువ హీరో విశ్వక్ సేన్ మధ్య చోటు చేసుకున్న వివాదం టాలీవుడ్‌లో పెను దుమారానికి కారణమైంది. అతను కమిట్‌మెంట్ లేని నటుడని... అందుకే సినిమా నుంచి తొలగిస్తున్నట్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి మరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే యాక్షన్ కింగ్ తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు విశ్వక్ సేన్. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన రాజయోగం మూవీ టీజర్ లాంచ్‌కి చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ‘‘కథ బాగా నచ్చడంతో అర్జున్‌తో కలిసి సినిమా చేద్దామని అనుకున్నానని చెప్పారు. కానీ తాను సూచించిన వాటిని కనీసం అర్జున్ సర్ పట్టించుకోలేదని, తనపై నమ్మకం వుంచి బ్లైండ్‌గా వెళ్లిపోవాలని సూచించారని విశ్వక్ సేన్ అన్నారు.
నా వల్ల ఏ ఒక్క నిర్మాత నష్టపోలేదు:
తాను నటుడిని అయ్యేందుకు ఎంతో కష్టపడ్డానని, ఎన్నో అవమానాలు భరించి, ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగానని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ఈ స్థాయిలో వున్నా.. ఏదో అవకాశం వచ్చింది కదా అని తాను సినిమాలు చేయనని, సినిమాకు సంబంధించి అన్ని పనులను భుజాన వేసుకుని చూసుకుంటానని విశ్వక్ అన్నారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక దాని ప్రమోషన్ కోసం రోడ్లపై తిరుగుతానని.. తన లాంటి కమిట్‌మెంట్ ఉన్న ప్రొఫెషనల్ నటుడు వుండడని ఆయన అన్నారు. తన వల్ల ఇప్పటి వరకు ఏ నిర్మాతా బాధపడలేదని.. ఒక్క రూపాయి కూడా నష్టపోలేదని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. నేను పనిచేసిన సినిమాలలో ఒక్క లైట్ బాయి అయినా తనను కమిట్‌మెంట్ లేని నటుడు కాదంటే ఈ క్షణమే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతానని ఆయన స్పష్టం చేశారు.
పది విషయాల్లో రెండింటిని కూడా పట్టించుకోలేదు :
సీనియర్ దర్శకుడైనా , లేక కొత్తవారైనా వారికి గౌరవం ఇచ్చి తాను పుచ్చుకున్నానని.. అర్జున్ సర్ సినిమాని కూడా ఇలాగే ప్రారంభించానని విశ్వక్ సేన్ వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే ఒక వారం ముందే తనకు స్క్రిప్ట్ అందిందని.. కొన్ని అంశాలు చెబితే, అర్జున్ సర్ వాటిని వదిలేయాలని చెప్పారని, తనను నమ్మి చేసుకుంటూ వెళ్లిపోమ్మన్నారని విశ్వక్ సేన్ గుర్తుచేశారు. తాను చెప్పే పదింట్లో కనీసం రెండింటిని అర్జున్ సర్ పరిగణనలోనికి తీసుకున్నా విషయం ఇక్కడిదాకా వచ్చేది కాదని.. కానీ ఇష్టం లేని కాపురం చేయలేనని ఆయన తేల్చి చెప్పారు.
సినిమా నుంచి తప్పుకోలేదు.. సినిమాని నేను ఆపలేదు:
అయినప్పటికీ తనవంతు బాధ్యతగా లుక్ టెస్ట్‌లో పాల్గొని అర్జున్ సర్‌కి పంపించానని... తీరా షూటింగ్ రోజున తన వల్ల కాలేదన్నారు. అందుకే ఈ ఒక్కరోజు షూటింగ్ క్యాన్సిల్ చేయాలని.. కొన్ని విషయాలు మాట్లాడుకుందామని ఆయనకు మెసేజ్ పెట్టానని విశ్వక్ సేన్ తెలిపారు. తాను , తన మేనేజర్ ఎన్నిసార్లు ప్రయత్నించినా అర్జున్ సర్ నుంచి రెస్పాన్స్ లేదని.. చివరికి అదే రోజు మధ్యాహ్నం వాళ్ల మేనేజర్ నుంచి అకౌంట్ వివరాలు పంపారని ఆయన చెప్పారు. అర్జున్ సర్ సినిమా నుంచి తనంతట తాను తప్పుకోలేదని.. సినిమాని తాను ఆపలేదని విశ్వక్ పేర్కొన్నారు.
నేను నాలుగు గోడల మధ్య మాట్లాడితే.. ఆయన మాత్రం:
తనకు ఎలాంటి ఇబ్బంది కలిగినా నాలుగు గోడల మధ్యే ఆయనతో మాట్లాడి.. గౌరవం ఇచ్చానని.. కానీ అర్జున్ సర్ మాత్రం ప్రెస్‌మీట్ పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల తన కుటుంబం, స్నేహితులు తీవ్రంగా బాధపడుతున్నారని.. తనను తప్పించిన సినిమా గురించి ఇంకేం మాట్లాడాలన్న ఉద్దేశంతోనే వివాదంపై స్పందించలేదని... సినిమాపరంగా ఏమైనా తప్పుచేశానంటే, ఇప్పుడే ఇండస్ట్రీని వదిలేస్తానని విశ్వక్ సేన్ చెప్పారు. తన వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగి వుంటే క్షమించండి సార్ అంటూ అర్జున్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com