Trisha Krishnan : కాంగ్రెస్‌లోకి త్రిష.. తమిళనాట కలకలం, పొలిటికల్ ఎంట్రీపై ఆమె ఏమన్నారంటే..?
- IndiaGlitz, [Monday,December 26 2022]
భారతదేశంలో సినీ తారలకు రాజకీయాలకు విడదీయరాని అనుబంధం వుంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో తారలు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి పాల్గొనగా.. కొందరు మాత్రం బయటి నుంచి మద్ధతు ఇచ్చారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసి సక్సెస్ అయిన వారు కొందరే. ఇలాంటి వాతావరణం ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాదిలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్టీఆర్, ఎమ్జీయార్, జయలలిత వంటి వెండితెర వేల్పులు ముఖ్యమంత్రులై చరిత్ర సృష్టించారు. వారి స్పూర్తితో ఎందరో రాజకీయాల్లోకి ప్రవేశించి తమ అదృష్టం పరీక్షించుకున్నారు.
పొన్నియన్ సెల్వన్‌తో త్రిషకు పోటెత్తిన అవకాశాలు:
ఇదిలావుండగా... దక్షిణాదిలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న త్రిష (Trisha Krishnan) కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా గత కొన్నిరోజుల నుంచి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కొన్నేళ్ల వరకు సరైన హిట్ లేక ఇక ఫేడ్ అవుట్ అనుకుంటున్న సమయంలో పొన్నియన్ సెల్వన్ సినిమా హిట్ కావడంతో త్రిష కెరీర్ మరోసారి మలుపు తిరిగింది. అందాల ఐశ్వర్యారాయ్ వున్నప్పటికీ... త్రిష (Trisha)అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పటి నుంచి ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ వీటిలో కథాబలం వున్న కొన్నింటికి మాత్రమే త్రిష ఓకే చెబుతూ.. చాలా వరకు సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారు.
రాజకీయాల్లోకి ఎంట్రీపై త్రిష మాట ఇదే :
ఈ పరిణామాల నేపథ్యంలో త్రిష (Trisha) పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ తమిళనాట ఊహాగానాలు వెల్లువెత్తాయి. త్వరలో ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోబోతున్నారంటూ కథనాలు వచ్చాయి. అయితే రాంగీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న త్రిష ఈ వార్తలను ఖండించారు. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే వుందని పేర్కొన్నారు. తనకు రాజకీయాలు నచ్చవని.. వాటి గురించి ఏమీ తెలియదని, తన పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. త్రిష స్టేట్‌మెంట్‌తో ఆమె రాజకీయ అరంగేట్రం గురించి వస్తున్న వార్తలకు చెక్ పడినట్లయ్యింది.