ఎవరేంటి అనేది తెలిసింది..: కన్నీటి పర్యంతమైన శివపార్వతి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటి శివపార్వతి కరోనా బారిన పడి.. మరణం అంచుల వరకూ వెళ్లి తిరిగి వచ్చానని తెలిపారు. ఇంటికి వస్తానని అసలు ఊహించలేదన్నారు. ఆ సమయంలో తను నటిస్తున్న సీరియల్ ‘వదినమ్మ’ యూనిట్ తనను అసలు పట్టించుకోలేదన్నారు. కనీసం తాను ఉన్నానో పోయానో అని కూడా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా తాను చిత్రసీమకు దూరమైనా జీవితా రాజశేఖర్ విషయం తెలుసుకుని ఆసుపత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారని శివపార్వతి వెల్లడించారు. తనకు ఆమె చాలా సపోర్ట్‌గా నిలిచారన్నారు.
‘‘వదినమ్మ యూనిట్‌కు నమస్తే. నాకు కరోనా పాజిటివ్ వచ్చి.. మళ్లీ ఇంటికి వెళతానో లేదోనన్న పరిస్థితుల్లోకి వెళ్లి పోయి.. పది రోజుల తర్వాత నిన్న రాత్రే ఇంటికి చేరాను. రెండు హాస్పిటల్స్ తిరిగాను. ఈ విషయం ప్రభాకర్ యూనిట్‌కి కూడా తెలుసు. ఈ విషయంలో నేను ఎవ్వరినీ ఏమీ అనదలుచుకోలేదు. థాంక్స్ మాత్రమే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి రాకపోతే ఎవరేంటి అనేది తెలీదు. ఇప్పుడు తెలిసింది. ఎవరికైనా చావు ఒకటే. నేను మీ యూనిట్లో వర్క్ చేసిన వ్యక్తిని. కానీ నా గురించి ఏ ఒక్కరూ ఏ హాస్పిటల్లో ఉన్నారని కానీ ఎలాంటి పరిస్థితిల్లో ఉన్నారని కానీ పట్టించుకోలేదు. నేను ప్రభాకర్ గారి గురించి కూడా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చెయ్యను. మేము కూడా అలాగే ఉండాలి. నటించామా.. లేదా అని మాత్రమే చూడాలి.
నేను ఐదేళ్లుగా సినిమాలు చేయకున్నా.. జీవితా రాజశేఖర్ హాస్పిటల్‌కు వచ్చి డాక్టర్లతో మాట్లాడి.. చాలా విషయాల్లో నాకు సపోర్ట్ చేసి నన్ను బయటకు తీసుకొచ్చారు. ప్రభాకర్ గారు.. రెండు లక్షలు ఏం సరిపోతుంది.. పది లక్షలు ఇన్స్యూరెన్స్ తీసుకోండని చెప్పారు. అది నేను చేసుకోలేకపోయాను. ప్రొడక్షన్ నుంచి ఇన్స్యూరెన్స్ ఏదో చేశారన్నారు. కానీ నాకేమైనా అది ఉపయోగపడుతుందేమోనని క్లెయిమ్ చేసుకోమని చెప్పలేదు. నేను పోయానని తెలిసినా ఎవరూ పట్టించుకోరు. ఎవరికీ తెలియనివ్వరు.. కామ్‌గా షూటింగ్ జరిగిపోతుంది. వదినమ్మ సీరియల్ ప్రొడ్యూసర్ శివకుమార్ వరంగల్ దగ్గర ఒక వంద రూపాయల శాలువా కప్పి సన్మానం చేశారు. చాలా అభిమానం చూపించారు. ఈ అభిమానంలో మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఇది న్యాయం కాదు.. తప్పు. ఆర్టిస్టుల పట్ల ప్రేమ పంచితే చచ్చిపోయేవాడికి కూడా బలం వస్తుంది’’ అంటూ శివపార్వతి కన్నీటి పర్యంతమయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments