Samantha:ధ్యానం సింపుల్ .. బట్ పవర్ఫుల్ , ఇవాళే అర్ధమైంది : సమంత మెడిటేషన్ ఫోటోలు వైరల్
- IndiaGlitz, [Thursday,July 20 2023]
గత కొంతకాలంగా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు అగ్ర కథానాయిక సమంత. నాగచైతన్యతో విడాకుల తర్వాత కొన్నాళ్లు సినిమాకు గ్యాప్ ఇచ్చిన సమంత.. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ అయ్యారు. ఈ క్రమంలో మయోసైటిస్ బారినపడినా మొక్కవోని ధైర్యంతో దానిని అధిగమించారు. గతంలో తాను ఒప్పుకున్న ప్రాజెక్ట్‌లను ఒక్కొక్కొటిగా పూర్తి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమంత సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం సినిమాలకు బ్రేక్ చెప్పాలని సామ్ ఫిక్స్ అయ్యారట.
ఈషా ఫౌండేషన్‌లో ధ్యానం చేసిన సమంత :
సినిమాలకు బ్రేక్ చెప్పిన సమంత పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయారు. పూజలు, ఆలయ దర్శనం, ధ్యానం వంటి కార్యక్రమాలతో గడుపుతున్నారు. తాజాగా తనకు ఎంతో ఇష్టమైన కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌కు సామ్ బుధవారం వెళ్లారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సమంత సాధనలు చేశారు. అంతేకాదు.. ధ్యానంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె పంచుకున్నారు.
ఆ స్థితి సాధ్యమేనన్న సామ్ :
‘‘మదిలో ఆలోచనల ఉద్దృతి, శరీరంలో కదలికలు లేని నిశ్చలమైన స్థితి అసాధ్యమని నాకు ఇప్పటి వరకు అనిపించింది. కానీ ధ్యానమనేది ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తిమంతమైన మార్గమని ఇవాళ అర్ధమైంది. ఈ ప్రక్రియ సులభంగా ఇంత శక్తిమంతంగా వుంటుందని ఊహించలేదు’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత పోస్ట్ చేశారు. ప్రస్తుతం సమంత ధ్యానం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో సామాన్యులతో కలిసి నేలపై కూర్చొని, సింపుల్‌గా వున్న సామ్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.