nayanthara: చెప్పులు ధరించి తిరుమాడ వీధుల్లో షికారు, ఆపై ఫోటో షూట్.. వివాదంలో నయనతార దంపతులు
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లయిన రెండో రోజే నవ దంపతులు విఘ్నేశ్ శివన్, నయనతారలు వివాదంలో చిక్కుకున్నారు. గురువారం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట శుక్రవారం తిరుమల విచ్చేసి, శ్రీవారి కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం వీరికి వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొందరు భక్తులు ఈ జంటను చూసేందుకు ఉత్సాహం చూపగా... మరికొందరు ఫొటోలు తీసుకున్నారు.
ఏకంగా మహాద్వారం ముందు ఫోటో షూట్:
అయితే దర్శనానంతరం బయటకు వచ్చిన నయనతార మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడిచారు. ఆమె భర్తతో పాటు ఇతరులందరూ చెప్పుల్లేకుండానే కనిపించారు. కానీ నయనతార మాత్రం చెప్పులు ధరించడం వివాదాస్పదమయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వెంటనే మహాద్వారానికి సమీపంలో నయన్ - విఘ్నేష్ శివన్‌లు ఫోటోషూట్ నిర్వహించడం మరో వివాదానికి దారి తీసింది. ఈ ప్రాంతంలో ఫోటోగ్రఫీ నిషేధం.. అలాంటిది ఈ జంటకు అనుమతి ఎవరు ఇచ్చారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
నయనతార దంపతులపై చర్యలు తప్పవు: టీటీడీ
అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) స్పందించింది. తిరుమల మాడ వీధుల్లో నయనతార చెప్పులతో నడవడం దురదృష్టకరమని టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్ బాల్ రెడ్డి అన్నారు. ఆలయం ముందు నిబంధనలకు విరుద్ధంగా ఫొటోషూట్ చేశారని ఆయన తెలిపారు. ఫొటో షూట్ జరుగుతుండగా విధుల్లో ఉన్న ఉద్యోగులపై చర్యలు తప్పవని బాల్‌రెడ్డి హెచ్చరించారు. న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత నయనతార దంపతులపై చర్యలు తీసుకుంటామని బాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తిరుమాడ వీధుల్లోకి నయనతార చెప్పులు ధరించి రావడం శ్రీవారి సేవకుల వైఫల్యమేనని ఆయన అంగీకరించారు. భవిష్యత్‌లో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని బాల్‌రెడ్డి స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments