Dimple Hayathi:ఐపీఎస్‌తో గొడవ .. 'సత్యమేవ జయతే' అంటూ డింపుల్ హయతి ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
డింపుల్ హయాతి.. అచ్చ తెలుగమ్మాయి. నటన, డ్యాన్స్, అందం ఇలా అన్నింటిలోనూ టాలెంట్ వున్నా.. అదృష్టం లేకపోవడంతో స్టార్ స్టేటస్ రాలేదు. ఈమె కన్నా వెనుక వచ్చిన హీరోయిన్లంతా దూసుకెళ్తుంటే.. డింపుల్ పరిస్ధితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుంది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాలో జర్ర జర్ర అనే సాంగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డింపుల్.. ఆ తర్వాత హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది కానీ వరుస ఫ్లాప్‌లు ఆమెను పలకరించాయి. ఇటీవల గోపీచంద్‌తో చేసిన రామబాణంపై ఎన్నో ఆశలు పెట్టుకోగా.. అది కూడా నిరాశ పరిచింది.
ఐపీఎస్‌తో గొడవ.. డింపుల్‌పై పోలీస్ కేసు :
ఇదిలావుండగా.. మీడియా కవరేజ్‌కు చాలా దూరంగా వుండే డింపుల్ హయాతి తాజాగా వార్తల్లో నిలిచారు. ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఐపీఎస్ ఆఫీసర్‌తో గొడవ నేపథ్యంలో డింపుల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎన్‌క్లేవ్‌లో వున్న ఎస్‌ఆర్‌కేఆర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం వుంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో డింపుల్ తన స్నేహితుడు విక్టర్ డేవిడ్‌తో కలిసి వుంటున్నారు. అయితే రాహుల్ కారు పార్క్ చేసే స్థలంలో డింపుల్, ఆమె స్నేహితుడు తమ బీఎండబ్ల్యూ కారును నిలిపివుంచేవారు. దీంతో పాటు డీసీపీతో పలుమార్లు గొడవకు దిగుతూ వీరంగం సృష్టిస్తున్నారు . రాహుల్ అధికారిక వాహనానికి వున్న కవర్‌ను ఉద్దేశ్యపూర్వకంగా తొలగించడం, కారుకి అడ్డుగా పెట్టిన కోన్‌లను కాలితో తన్నడం వంటివి చేశారు. దీనిపై రాహుల్ హెగ్డే పలుమార్లు మందలించినప్పటికీ.. వీరి ప్రవర్తనలో మార్పు రాలేదు.
ఎన్నిసార్లు నచ్చజెప్పినా తీరు మార్చుకోని డింపుల్ :
ఇదే సమయంలో మే 14న రాహుల్ హెగ్డే కారును తన కారుతో ఢీకొట్టడంతో పాటు కాలితో తన్నుతూ వీరంగం సృష్టించారు డింపుల్, డేవిడ్. దీనిపై ప్రశ్నించిన రాహుల్ హెగ్డే డ్రైవర్‌తోనూ ఆమె గొడవకు దిగింది. దీంతో డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు డింపుల్, డేవిడ్‌లపై ఐపీసీ సెక్షణ్ 353, 341, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. సోమవారం వీరిద్దరిని అదుపులోకి తీసుకుని.. 41 (ఏ) కింద నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.
వివాదంపై వరుస ట్వీట్స్ చేసిన డింపుల్ :
అయితే తనపై నమోదు చేసిన పోలీస్ కేసు, ఐపీఎస్‌తో వివాదం నేపథ్యంలో డింపుల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అసలు గొడవ ఏంటీ అన్న విషయాన్ని ప్రస్తావించకుండా వరుస ట్వీట్లు చేశారు. ‘‘అధికారాన్ని వాడి తప్పుల్ని అడ్డుకోలేరు’’, ‘‘అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పుల్ని కప్పిపుచ్చలేరు.. సత్యమేవజయతే’’ అంటూ ట్వీట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే మొత్తం ఈ వివాదంలో తప్పు ఎవరిది అనేది తేలాలంటే సీసీటీవీ ఫుటేజ్ ఒక్కటే మార్గం. ప్రస్తుతం ఫుటేజ్‌ను విశ్లేషించే పనిలో వున్నారు పోలీసులు. దీనిని బట్టి నేరం ఎవరిదో తేల్చనున్నారు.
Misuse of power doesn’t hide mistakes .. 😂 . #satyamevajayathe
— Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com