Charmee Kaur:వెంటాడుతోన్న లైగర్.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ఆందోళనపై చార్మీ స్పందన
- IndiaGlitz, [Friday,May 12 2023]
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘‘లైగర్’’ ఇది అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. విజయ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో పాటు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే, బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ వంటి వారు నటించడంతో ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. దీనికి తోడు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో బొమ్మ అదిరిపోతుంతని అంతా భావించారు. తీరా లైగర్ రిలీజైన తర్వాత అందరికీ ఫీజులెగిరిపోయాయి. డివైడ్ టాక్‌తో ఎవ్వరిని ఈ చిత్రం సంతృప్తి పరచలేదు. రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.60 కోట్లను మాత్రమే రాబట్ట గలిగింది.
ఈడీ కేసులనూ ఎదుర్కొన్న లైగర్ :
లైగర్ పరాజయం హీరో విజయ్ దేవరకొండకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ తర్వాత ఆయన ఏ పబ్లిక్ వేదికలోనూ కనిపించలేదంటే అర్ధం చేసుకోవచ్చు. దీనికి తోడు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించిన పూరి జగన్నాథ్, ఛార్మీలకు ఈడీ కేసులు చుట్టుకున్నాయి. లైగర్‌లో కొందరు రాజకీయ నాయకులు రహస్యంగా పెట్టుబడులు పెట్టారని, హవాలా మార్గంలో నిధులు మళ్లించారని ఈడీ అనుమానిస్తోంది. దీంతో ఇప్పటికే పూరి, చార్మీ, విజయ్ దేవరకొండలను విచారించింది . పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా హిట్ అవుతుందని భావించి.. దీనిపై పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భరించలేని నష్టాలను ఎదుర్కొన్నారు.. నేటికి ఎదుర్కొంటున్నారు. ఈ సినిమా వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు గతంలోనే పూరీ జగన్నాథ్ అంగీకారం తెలిపారు.
అందరికీ న్యాయం చేస్తానన్న చార్మీ :
బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్ అయిపోయిందని.. వివాదం సద్దుమణిగిందని భావిస్తున్న వేళ.. అనూహ్యంగా వీరంతా ధర్నాకు దిగడం టాలీవుడ్‌లో కలకలం రేపింది. శుక్రవారం లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హైదరాబాద్ ఫిలింఛార్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అండ్ లీజర్స్ అసోసియేషన్ నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు సైతం చేపట్టింది. తమను ఆర్ధికంగా ఆదుకుంటామని పూరి జగన్నాథ్ హామీ ఇచ్చారని.. ఈ మాట నిలబెట్టుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం ఎటు తిరుగుతుందోనని భావిస్తున్న వేళ .. లైగర్ నిర్మాత ఛార్మీ స్పందించారు. ఈ ఆందోళన విషయం తన దృష్టికి వచ్చిందని.. త్వరలోనే వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్‌కు ఈ మెయిల్ ద్వారా తన సందేశాన్ని పంపారు. మరి వీరంతా ఛార్మీ హామీతో ఆందోళన విరమిస్తారో లేదో వేచి చూడాలి.