నేనేందుకు నిర్మాతనయ్యానంటే.. ఒక్కసారిగా గతంలోకి వెళ్లిన విజయ్ దేవరకొండ
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారానన్నారు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఆయన స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘‘పుష్పక విమానం’’. ఈ సినిమాలో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. దామోదర దర్శకత్వం వహించగా.. గీత్ సైని, శాన్వి మేఘన హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 12న పుష్పక విమానం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం విశాఖపట్నంలో ‘పుష్పక విమానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. నిర్మాణ పనులు చూసుకోవడం చాలా కష్టమైన పని అని... ఒక్కోసారి ఇది అవసరమా అనిపిస్తుంటుంది అని అన్నారు.
పుష్పక విమానం విడుదల సమయంలో నేను ఇండియాలో ఉండనని... ‘లైగర్’ షూటింగ్ కోసం యూఎస్ వెళ్తున్నా అని విజయ్ చెప్పారు. అందుచేత తాను నిర్మించిన ఈ సినిమాని మీరే చూసుకోవాలని విజయ్ తన అభిమానులను కోరారు. కెరీర్ స్టార్టింగ్లో తాను పడిన కష్టాలు మరొకరు పడకూడదనే ఉద్దేశంతో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించానని ఆయన చెప్పారు. అయితే నిర్మాణ పనులు చూసుకోవడం చాలా కష్టంగా ఉందని.. నటుడిగా కథలు ఎంపిక చేసుకోవడం, పాత్రల కోసం శిక్షణ తీసుకోవడం, సినిమాని ప్రచారం చేసుకోవడం.. ఇలా తీరిక లేకుండా ఉంటోందని విజయ్ చెప్పారు. ఇలాంటి పరిస్ధితిలో ఇంకో సినిమాని నిర్మించి, దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడమంటే మాటలు కాదని.. ఒక్కోసారి ఇది మనకు అవసరమా అనిపిస్తుంటుందని విజయ్ వ్యాఖ్యానించారు.
అయితే కాన్ఫిడెన్స్, మీరు నాపై పెట్టిన నమ్మకంతో ముందుకెళ్తానని ఆయన అన్నారు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలకు ముందుకు నేనెవరో మా గల్లీ వారికే తెలియదని తాను పడిన కష్టాల గురించి విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. ఈ జర్నీని అసలు ఊహించలేదని.. తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్ర దర్శకుడు దామోదరతో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని.. తనలో మంచి రచయిత ఉన్నాడని, సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడని విజయ్ ప్రశంసించారు. తమ్ముడు ఆనంద్ నటన ప్రతి ఒక్కరికి నచ్చుతుందని... హీరోయిన్లు ఇద్దరూ చాలా చక్కగా చేశారని ఆయన కొనియాడారు. ఇక పుష్పక విమానంతో పాటే నవంబరు 12న విడుదలవుతున్న కార్తికేయ ‘రాజా విక్రమార్క’ చిత్రం కూడా బాగా ఆడాలని విజయ్ ఆకాంక్షించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments