ప్రధాని మోదీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సిద్దార్థ్
- IndiaGlitz, [Saturday,April 24 2021]
దేశం తగలబడిపోతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చొన్నాడట.. ప్రస్తుతం మన దేశ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. దేశం మొత్తం కరోనాతో అల్లాడుతుంటే.. ఆక్సిజన్ కొరత ఏర్పడి పదుల సంఖ్యలో ఒక్కో ఆసుపత్రిలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ప్రధాని మోదీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సమయంలో పనికి వచ్చే విషయం ఏమైనా చెబుతారేమోనని ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు. కానీ ఆయన చెప్పిందేమీ లేదు. లాక్‌డౌన్ విధించే పరిస్థితిని తెచ్చుకోవద్దని సెలవిచ్చి సైలెంట్ అయిపోయారు.
మోదీ ప్రసంగంపై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా మోదీని నెటిజన్లు కడిగి పారేశారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలు.. ఆక్సిజన్ కొరత.. సామాన్యుడికి వైద్యం అందుబాటులో లేని పరిస్థితి.. గవర్నమెంటు ఆసుపత్రుల్లో మౌళిక వసతుల కరవు.. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలవలేని దౌర్భాగ్య స్థితి. జనాల నుంచి పన్నుల రూపంలో కోట్లకు కోట్లు దండుకుంటోంది. ఇంకా నష్టాల పేరుతో ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేస్తోంది. ఎప్పటిలాగే మన మాటల మాంత్రికుడైన ప్రధాని ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ద్వారా తాను దేశం పట్ల ఎంతటి విధేయతతో ఉన్నానో అనే విషయం చెప్పే ప్రయత్నమైతే చేశారనిపిస్తోంది.
ట్వీట్ చూసిన వాళ్లు దేశం పట్ల మోదీకి ఇంత ప్రేమ ఉందా? అని అనుకోకుండా ఉండలేరు. ఇంతకీ ఆయన ఏం ట్వీట్ చేశారంటే.. ‘‘భారత్‌కు ప్రస్తుత తరుణంలో చాలా బలమైన ప్రభుత్వం అవసరం. మోదీ అనే వాడు పెద్ద విషయమే కాదు. నేను నా పాత జీవితంలోకి వెళ్లి ఒక టీ స్టాల్‌ను ఓపెన్ చేయగలను. కానీ దేశం ఏమాత్రం ఇబ్బంది పడకూడదు’’ అని పేర్కొన్నారు. దీనికి హీరో సిద్దార్థ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘‘ఈ మనిషి చెప్పిన ప్రతి ఒక్క విషయంతో నేను ఏకీభవిస్తున్నా. మీరు ఏకీభవించగలరా..?’’ అని సిద్దార్థ్ ప్రశ్నించారు.
I agree with every one of this man's points here. Can you believe it? https://t.co/m1SWxpgdmo
— Siddharth (@Actor_Siddharth) April 24, 2021