ప్రముఖ సినీ నటుడు సచిన్ జోషి అరెస్ట్..

  • IndiaGlitz, [Thursday,October 15 2020]

ప్రముఖ సినీ నటుడు సచిన్ జోషిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్కా అక్రమ రవాణా ఆరోపణలు రావడంతో హైదరాబాద్ పోలీసులు.. ముంబైకి వెళ్లి అరెస్ట్ చేశారు. దీంతో బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపింది. ఇటీవల హైదరాబాద్‌లో భారీ మొత్తంలో గుట్కా అక్రమ రవాణాను పోలీసులు ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను తమదైన శైలిలో విచారించగా.. పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే నటుడు సచిన్ జోషి పేరు కూడా బయటకు వచ్చింది. దీంతో పోలీసులు ముంబై వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు.

సచిన్‌పై ఐపీసీ 273, 336 సెక్షన్ల ప్రకారం నిషేధిత మత్తు పదార్థాల కేసు నమోదైంది. అయితే గత కొన్ని రోజులుగా ఆయన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు జరుపగా... ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డారు. సచిన్ గుట్కా అమ్మకాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సచిన్ గుట్కా బాక్సులను పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా.

కాగా.. బాలీవుడ్‌లో అత్యంత సంపన్న కుటుంబాలకు చెందిన నటుల్లో సచిన్‌ జోషి ఒకరు. ఆయన తండ్రి సైతం గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి. గుట్కా కింగ్‌గా ఆయనకు పేరుంది. సచిన్ అరెస్ట్ బాలీవుడ్‌లో సంచలనం మారింది. ఒకవైపు బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు నడుస్తుండగానే ఇలా ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా.. సచిన్ టాలీవుడ్‌లో ‘మౌనమేలనోయి’, ‘నిను చూడక నేనుండలేను’, ‘ఒరేయ్‌ పండు’ తదితర చిత్రాల్లో నటించాడు.