Raghubabu:సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటుడు గిరిబాబు కుమారుడు, నటుడు రఘుబాబు(Raghubabu) నడుపుతున్న కారు ఎదురుగా వెళ్తున్న బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. మృతుడిని బీఆర్ఎస్ నాయకుడు, నల్లగొండ శ్రీనగర్ కాలనీకి చెందిన సందినేని జనార్దన్ రావుగా గుర్తించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జనార్దన్ రావు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారు. అద్దంకి బైపాస్ రోడ్డులో ఓ వెంచర్ ఏర్పాటు చేసి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బైక్‌పై వెంచర్‌కు వెళుతూ నల్లగొండ శివారులోని లెప్రసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న రఘుబాబు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు, జనార్థన్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో జనార్దన్ గాల్లోకి ఎగిరి కారు బానెట్‌పై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ సమయంలో రఘుబాబు డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
జనార్దన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం. ఆయనకు భార్య నాగమణి, కుమార్తె,కుమారుడు ఉన్నారు. ఆయన భార్య నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని రఘుబాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా జనార్దన్ రావు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో చురుకైన నేతగా కొనసాగారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
అటు జనార్థన్ రావు మృతిపట్ల నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆయన సోదరుడు నల్లగొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రభుత్వాస్పత్రిలో ఆయన మృతదేహాన్ని పరిశీలించి నివాళుర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీనియర్ నాయకుడిని పార్టీ కోల్పోవడం చాలా బాధాకరమని వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout