సినీ నటుడు పొట్టి వీరయ్య ఇక లేరు..
- IndiaGlitz, [Sunday,April 25 2021]
ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య(74) ఇకలేరు. ప్రస్తుతం హైదరాబాద్ చిత్రపురి కాలనీలో నివాసముంటున్న ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల కొంత కోలుకున్నప్పటికీ ఆదివారం ఆయనకు గుండె నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు సన్ షైన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి స్వగృహానికి తరలించారు. రేపు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో పొట్టి వీరయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.
పొట్టి వీరయ్య స్వగ్రామం.. నల్గొండ జిల్లా, తిరుమలగిరి తాలూకా ఫణిగిరి గ్రామం. గట్టు సింహాద్రయ్య, నరసమ్మల రెండో కుమారుడు. మంగళ్‌గోపాల్ అనే వ్యక్తి ద్వారా వీరయ్య 1967లో మద్రాసులో అడుగుపెట్టాడు. అక్కడ ఓ పూల అంగడిలో వీరయ్యను చేర్పించారు. ఆయన ద్వారా ప్రముఖ నటుడు శోభన్‌బాబును కలిశారు. ఆయన ఇతడిని చూసి, బి.విఠలాచార్యను కానీ, భావన్నారాయణను కానీ కలవాలని సలహా ఇచ్చారు. శోభన్‌బాబు మాట ప్రకారం భావన్నారాయణను కలిసినా పెద్దగా స్పందన రాకపోవడంతో.. తర్వాత విఠలాచార్యను కలిశారు. పొట్టి వీరయ్య ఆకారం విఠలాచార్యకు నచ్చి తన సినిమాలలో అవకాశాలు కల్పించారు. అలా ‘అగ్గివీరుడు’ చిత్రం ద్వారా పొట్టి వీరయ్య సినీ రంగానికి పరిచయమయ్యారు. సినీ పరిశ్రమలో విఠలాచార్య తర్వాత దర్శకుడు దాసరి నారాయణరావు వీరయ్యను బాగా ప్రోత్సహించారు.
పొట్టివీరయ్య 2అడుగుల ఎత్తు మాత్రమే ఉంటారు. ఇదే ఆయనకు సినిమా అవకాశాలు రావడానికి కారణమైంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలనుంచి కలర్ సినిమాలవరకు జనరేషన్‌లో నటించి మెప్పించిన నటుడు ఆయన. చాలాకాలంపాటు తన ఆహార్యానికి తగిన పాత్రలు వేస్తూ చెన్నై, హైదరాబాద్‌లో గడిపారు. హైదరాబాద్ సినిమా రంగం తరలివచ్చాక ఆయనకు అవకాశాలు కొంత మేరకు మెరుగయ్యాయి. కానీ ఆయన కుటుంబపోషనకు అది సరిపోయేదికాదు. ఈ నేపథ్యంలోనే ఆయన వికలాంగుల కోటా కింద హైదరాబాద్ కృష్ణానగర్‌లో బడ్డీకొట్టు పెట్టుకుని జీవనం సాగించేవారు. ఆయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. ప్రస్తుతం ఆయన తన కుమార్తె వనజ దగ్గర వుంటున్నారు.