Madhavan:ఇది కదా పుత్రోత్సాహమంటే .. స్విమ్మింగ్‌లో సత్తా చాటిన మాధవన్ కొడుకు, ఏకంగా 5 స్వర్ణాలు

  • IndiaGlitz, [Monday,April 17 2023]

హీరో కొడుకు .. హీరో అవుతాడనేది పాత సామెత. కానీ ఈ తరం మాత్రం అందుకు భిన్నంగా వుంటోంది. స్టార్ హీరోలు తమ కుమారులను హీరోలుగా చేయకుండా తమ పిల్లలకు ఏ రంగం నచ్చితే అందులో ప్రోత్సహిస్తున్నారు. ఈ విషయంలో కోలీవుడ్ సీనియర్ నటుడు మాధవన్ ముందువరుసలో వుంటారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ అందాల నటుడిగా, రోమాంటిక్ హీరోగా మాధవన్‌కు గుర్తింపు వుంది. ఆయన తనయుడు వేదాంత్ మాధవన్ తండ్రిలాగే అందగాడు. ఇతను కూడా హీరోగా అడుగుపెడతాడని అంతా అనుకున్నారు. కానీ రోటీన్‌కు భిన్నంగా వెళ్లారు మాధవన్.

స్విమ్మింగ్ వైపు కొడుకుని ప్రోత్సహించిన మాధవన్:

వేదాంత్‌కు స్విమ్మింగ్ అంటే ఇష్టం కావడంతో అటు వైపుగా ప్రోత్సహించాడు. ప్రొఫెషనల్ స్విమ్మర్‌గా మారిన వేదాంత్ పలు టోర్నీల్లో సత్తా చాటుతున్నాడు. తాజాగా మలేషియన్ ఇన్విటేషనల్ ఏజ్ గ్రూప్ ఛాంపియన్‌షిప్స్‌లో వేదాంత్ అవార్డుల పంట పండించాడు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ (50 మీ, 100 మీ, 200 మీ, 400 మీ, 1500 మీ) పలు విభాగాల్లో భారతదేశానికి ఏకంగా 5 స్వర్ణాలు అందించాడు. కొడుకు అసాధారణ ప్రతిభతో మాధవన్ పొంగిపోతున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వేదాంత్ సాధించిన విజయాలను పంచుకున్నారు. తన బిడ్డను చూస్తుంటే గర్వంగా సంతోషంగా వుందని, అతనికి మద్ధతుగా నిలిచిన వారందరీకి మాధవన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వేదాంత్, మాధవన్‌లకు సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.

ఫిబ్రవరిలోనూ సత్తా చాటిన వేదాంత్ :

ఇకపోతే.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ‘‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023’’లో వేదాంత్ ఏకంగా ఏడు పతకాలు సాధించాడు. ఇందులో 5 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ వున్నాయి. వంద మీటర్లు, 200 మీటర్లు, 1500 మీటర్ల విభాగాల్లో స్వర్ణాలు సాధించిన వేదాంత్.. 400 మీటర్లు, 800 మీటర్ల విభాగంలో రజత పతకాలు సాధించాడని మాధవన్ చెప్పారు.