రెండు వారాల్లో గుడ్‌న్యూస్ చెబుతానన్నారు.. అలీకి జగన్ క్లారిటీ ఇచ్చేశారా..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి మంగళవారం రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టాలీవుడ్ సమస్యలు, ఇతర ఇబ్బందులపై చర్చించేందుకు మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఆ తర్వాత కమెడియన్ అలీ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. మంగళవారం కుటుంబ సమేతంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ఆలీ.. సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినిమా అంశాలతో పాటు రాజకీయాలపైనా చర్చించారు. ఇటీవల సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులు సీఎం జగన్ తో భేటీ అయిన సందర్భంగా అలీ కూడా వచ్చారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. రాజ్యసభ సీటు ఇస్తారనే విషయం తనకు తెలియదని, అలాంటి సంకేతాలు ఏవీ సీఎం జగన్ ఇవ్వలేదని చెప్పారు. అయితే అతి త్వరలోనే పార్టీ కార్యాలయం నుంచి కీలక ప్రకటన ఉంటుందని అలీ పేర్కొన్నారు.
వైఎస్‌ఆర్ సీఎం కాకముందు నుంచే వారి కుటుంబంతో తనకు పరిచయం ఉందని ఆయన గుర్తుచేశారు. 2004లో వైఎస్‌ఆర్ పాదయాత్ర చేసిన తర్వాత కలిశానని.. పదవి ఇస్తేనే పార్టీలోకి వచ్చి సేవ చేస్తానని అనలేదని అలీ చెప్పారు. గత సాధారణ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారని... సమయం లేక తానే వద్దని చెప్పానని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఏపీ సీఎం కార్యాలయం నుంచి ఆహ్వానం వచ్చిందని.. అందుకే ఫ్యామిలీతో కలిసి ముఖ్యమంత్రిని కలిసినట్లు అలీ వెల్లడించారు. పదవి ఇస్తేనే పార్టీలోకి వచ్చి సేవ చేస్తానని అనలేదని ఆయన గుర్తుచేశారు.
కాగా.. వైసీపీ తరపు నుంచి త్వరలో భర్తీకానున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి మైనార్టీలకు ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎం, మండలి డిప్యూటీ ఛైర్మన్ వంటి కీలక పదవులు కట్టబెట్టిన జగన్.. ఎంపీ పదవి కూడా ఇస్తే బాగుంటుందని సమాచారం. ఈ విషయంలో సినీనటుడు అలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆలీ వైసీపీలో చేరారు. ఆ సమయంలో అసెంబ్లీకి పోటీ చేయాలని భావించినా జగన్ సూచనతో ఆ ఆలోచను ఆయన విరమించుకున్నారు. .
అయితే గడిచిన రెండున్నరేళ్లుగా అలీకి పదవి దక్కుతుందని వార్తలు రావడం.. చివరి నిమిషంలో నిరాశ ఎదురవ్వడం జరుగుతూ వస్తోంది. కానీ ఈ సారి మాత్రం కన్ఫర్మ్ చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డితో పాటు ఓ బీసీ నేతకు సీటు ఖాయమైనట్లు తెలుస్తోంది. మరోసీటు ఎస్సీలకు, నాలుగో సీటు మైనారిటీలకు ఇస్తారని టాక్. మరి జగన్ మనసులో ఏముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments